‘నన్ను కాదు.. కలెక్టర్‌ను అడగండి’..

‘నన్ను కాదు.. కలెక్టర్‌ను అడగండి’..

  • యూరియా బస్తాపై అదనపు వసూళ్లు?.. రైతుల ఆగ్రహం
  • ఎక్కువ ధరకు యూరియా అమ్ముతున్నారని ప్రశ్నించిన
  • రైతులకు షాప్ నిర్వాహకుల సమాధానం

మద్దిరాల, ఆంధ్రప్రభ : మద్దిరాల క్రాస్‌రోడ్డు ప్రాంతంలోని ఓ ఎరువుల దుకాణంలో యూరియా బస్తాల విక్రయంలో అదనపు ధరలు వసూలు చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుకాణ నిర్వాహకురాలు రైతులతో దురుసుగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

వివరాల ప్రకారం.. మద్దిరాల క్రాస్‌రోడ్డులోని స్వర్ణ ఫెర్టిలైజర్స్ దుకాణంలో యూరియా బుక్ చేసుకున్న రైతులు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అయితే ఒక్కో యూరియా బస్తాకు రూ.310 చెల్లించాలని దుకాణ నిర్వాహకులు కోరారు. కాగా బిల్లులో మాత్రం రూ.267 మాత్రమే నమోదు చేయడంతో రైతులు దీనిపై ప్రశ్నించారు.

దీనికి స్పందించిన దుకాణ నిర్వాహకురాలు “అంతే ధర.. ఇష్టమైతే కొనండి, లేకుంటే వెళ్లిపోండి” అంటూ రైతులను హెచ్చరించినట్లు సమాచారం. రైతులు మరింతగా నిలదీయడంతో “నన్ను కాదు.. కలెక్టర్‌ను అడగండి. వీడియోలు కూడా తీసుకోండి” అంటూ దురుసుగా మాట్లాడినట్లు రైతులు ఆరోపించారు.

ఈ విషయంపై రైతు వల్లపు రమేష్ మండల వ్యవసాయ అధికారి అనూష రూహికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారి ఘటనపై విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే దుకాణాన్ని సీజ్ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఈ ఘటనతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.