ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమే: సీఎం రేవంత్ రెడ్డి
- విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా హైదరాబాద్‌లో భారీ కొవ్వొత్తుల ర్యాలీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఢిల్లీలో నీట్ (NEET) ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జిని ఖండిస్తూ, సీజేపీ (CJP) ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు శనివారం హైదరాబాద్‌లో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిళ్లు చేతబట్టి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి. శ్రీధర్ బాబు, మహ్మద్ అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా “ఈ దేశం యువతది… వారి భవిష్యత్తును ఎవరూ లాక్కోలేరు”, “విద్యార్థుల హక్కులను కాపాడాలి” అంటూ నినాదాలు చేశారు.
విద్యార్థులపై దాడులు తగవు: రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, బలప్రయోగానికి దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. విద్యార్థుల గొంతును అణచివేయడం కంటే వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
విద్యార్థుల ఉద్యమం ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఇది దేశ యువత సాధించిన విజయమని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఈ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవడం లేదని, విద్యార్థుల ఉద్యమానికి పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా మద్దతు లభించిందని పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తును యువతే తీర్చిదిద్దుతుందని పేర్కొన్న రేవంత్ రెడ్డి, 21 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అదే వయసులో యువత మంత్రులైతే దేశ భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీదేనని గుర్తు చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, విద్యార్థుల హక్కులను కాపాడేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు.
సోమవారం లోపు కేసులన్నీ ఉపసంహరించుకోవాలి
నీట్ వివాదంపై నిరసనలు తెలిపిన విద్యార్థులపై నమోదైన కేసులను సోమవారం లోపు పూర్తిగా ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈ వివాదం నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలని కోరారు. యువత ప్రారంభించిన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోకూడదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను యువత, విద్యార్థులు ధైర్యంగా ఎదిరించారని వ్యాఖ్యానించారు. ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావాలని, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
