expressway | నాణ్యతపై ప్రజల ఆగ్రహం

expressway | నాణ్యతపై ప్రజల ఆగ్రహం
expressway | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన నెల రోజుల్లోనే దెబ్బతిన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. రూ.36 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే నాణ్యతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే రహదారిపై గుంతలు ఏర్పడిన ఘటనకు సంబంధించిన అధికారిక నివేదిక ఇంకా వెలువడలేదు.
గంగా ఎక్స్‌ప్రెస్‌వే ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 29, 2026న ప్రారంభించారు. ఈ 594 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సుమారు రూ.36,230 కోట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో సుమారు 80 శాతం నిర్మాణ పనులను అదాని గ్రూప్ కు చెందిన Adani Road Transport Limited చేపట్టినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మిగతా భాగాన్ని ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించింది.
అయితే మే చివరి వారంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో ఎక్స్‌ప్రెస్‌వేలో కొన్ని ప్రాంతాల్లో గుంతలు, దెబ్బతిన్న భాగాలు కనిపిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా వినియోగదారులు నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. “ప్రారంభించిన నెల రోజుల్లోనే రోడ్డు దెబ్బతినడం ఆందోళనకరం” అని విమర్శిస్తున్నారు.
ఇక బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ ఘటన రాజకీయ రంగు దాల్చింది. భారీ వ్యయంతో నిర్మించిన రహదారి నాణ్యతపై సమగ్ర విచారణ జరపాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లేదా ప్రాజెక్టును నిర్మించిన సంస్థలు ఈ వైరల్ వీడియోలపై అధికారిక ప్రకటన చేయలేదు. రోడ్డు నిజంగా దెబ్బతిందా? లేక వర్షాలు లేదా స్థానిక పనుల కారణంగా తాత్కాలిక నష్టం జరిగిందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద మౌలిక సదుపాయ ప్రాజెక్టుల్లో ఒకటిగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రహదారి ద్వారా మీరట్-ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, రాష్ట్రంలో లాజిస్టిక్స్, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
