ఐఏఎస్ ఆఫీసర్లకు తొలి స్ఫూర్తి వేదిక మన్యం
అదే నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం
ఆ గడ్డమీద పనిచేసే ఆఫీసర్లలో ఎనలేని ధీరత్వం
ఎందరో ధీరుల ఆవిర్భావం.. మరెందరో వారసులకు పుట్టినిల్లు
తాండవ నిర్వాసితుల గుండెల్లో మాధవుడు.. కాకి మాధవరావు
ఇంగ్లిష్ చదువులకు భగీరథుడు.. డాక్టర్ జయప్రకాష్ నారాయణ
పేదోళ్లకు చదులమ్మగా తెలంగాణ సీఎస్ శాంతి కుమారి
ఇక్కడి నుంచే మేటీ ఐఏఎస్ అధికారుల తొలిప్రయాణం
వారి స్ఫూర్తితో రాణిస్తున్న మరో ముగ్గురు ఆఫీసర్లూ ఇక్కడోళ్లే
నర్సీపట్నంలో సివిల్స్ సర్వీసెస్ బాధ్యత తీసుకున్న ఎందరో అధికారులు.. అల్లూరి స్ఫూర్తితో సామాజిక సేవా దృక్ఫథంతో పని చేశారు. వీరిలో తొలి దళిత ఐఏఎస్ అధికారి కాకి మాథవరావు.. లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ , ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఏ. శాంతికుమారి వంటివారు నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే తొలిసారిగా ఉద్యోగ ప్రయాణం మొదలెట్టారు. వీరిలో ఒకరు తాండవ ప్రాజెక్టు నిర్వాసితులకు భూములు పంచారు. మరొకరు ఇంగ్లిష్ మీడియం చదువును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంకొకరు నర్సీపట్నం ప్రజల బాగోగుల కోసం కఠినంగా వ్యవహరించారు. ఇక.. చదువు లేనిదే.. ప్రగతి లేదని వయోజన విద్యకు శ్రీకారం చుట్టారు. ఐఏఎస్ అధికారుల చొరవ, ప్రజాసేవా దృక్ఫథం నర్సీపట్నం వారసుల మదిలో నిక్షిప్తం అయ్యింది..
-పసుపులేటి ప్రభాకరరావు, నర్సీపట్నం, ఆంధ్రప్రభ :
ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో బ్రిటిష్ కాలం జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమంలో తెల్లదొరలకు చుక్కలు చూపించిన అల్లూరి సీతారామరాజును అంతమొందించడానికి బ్రిటిషర్లు తమ పరిపాలన సౌలభ్యం కొరకు నర్సీపట్నంలో సబ్ కలెక్టర్ బంగ్లా, డీఎస్పీ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అల్లూరిని హతమర్చిన రూథర్ ఫర్డ్ సైతం నర్సీపట్నం కేంద్రంగా చేసుకొని అల్లూరి సీతారామరాజుపై దాడి చేసినట్లు చారిత్రాత్మక ఆధారాలున్నాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1946 నుంచి సబ్ కలెక్టర్లుగా పని చేసిన అధికారుల రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి చాలా మంది ఐఏఎస్ అధికారులు ఇక్కడ పని చేసి ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. ఈ అధికారుల విశేషాలు తెలుసుకుందాం.
తాండవ జనం గుండె చప్పుడు..
1965-67లో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన కాకి మాధవరావు తాండవ ప్రాజెక్ట్ నిర్వాసితులకు చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేరు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నాతవరం మండలంలో ఒక చక్కని ప్రాంతాన్ని ఏర్పాటు చేసి లబ్ధిదారులకు భూములిచ్చి వారంతా ఇండ్లు నిర్మించుకునే విధంగా సహాయపడ్డారు. దీంతో ఆ గ్రామస్తులంతా ఆయన పేరుతో మాధవ నగరం అని పేరు పెట్టుకున్నారు. ఇక జిల్లా కలెక్టర్ స్థాయికి ఎదిగిన కాకి మాధవరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాత్మక కలెక్టర్‌గా పేరొందారు. అప్పటి సీఎం పీవీ నరసింహారావు తీసుకువచ్చిన భూసంస్కరణల అమలులో మాధవరావు ఎక్కడా తగ్గలేదు. వరంగల్ జిల్లా భూ స్వాముల గుండెల్లో అలజడి సృష్టించారు. కుల ఆధిపత్యాన్ని తిప్పికొట్టిన తొలి దళిత కలెక్టర్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు.
ఇంగ్లిష్ చదువులకు భగీరథుడు.. జయప్రకాశ్
అవినీతి వ్యతిరేక వాది. ప్రజాస్వామ్య వాది డాక్టర్ జయప్రకాష్ నారాయణ 1982 నుంచి 19- 84 వరకూ తొలిసారిగా నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇంగ్లిష్ విద్యకు ప్రోత్సాహం అందించారు. అప్పట్లో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు ఉండాలని ఇంగ్లిష్ మీడియం స్థాపించే పాఠశాలలకు ప్రభుత్వ భూములను కేటాయించారు. అలా మొదలైన ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఎంతోమంది విద్యార్థులు విద్య అభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్లారు. ఈ రోజున ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులుగా నర్సీపట్నం వారసులుగా ఎదిగారు. ఇందుకు జయప్రకాష్ నారాయణ వేసిన ఇంగ్లిష్ మీడియం పునాదే కారణం అంటే అతిశయోక్తి కాదు.
నిమ్మగడ్డ.. మామూలోడు కాదు..
రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ 1984 నుంచి 86 వరకు సబ్ కలెక్టర్ గా ఇక్కడ పని చేశారు. ఆ సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మించినప్పటికీ అక్కడ బస్సులు నిలిపేవారు కాదు. పాత బస్టాండ్ వద్దే ఆపేవారు. దీంతో ఆయన స్పందించి రాత్రికి రాత్రి పాత బస్టాండ్ వద్ద ఇనుప రాడ్లు ఏర్పాటు చేసి బస్సులను నేరుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు తరలించారు. అక్కడి నుంచి మొదలైన ఆర్టీసీ కాంప్లెక్స్ ఎంతో మంది ప్రయాణికులకు అనుకూలంగా మారింది. ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందింది.
చదువులమ్మ.. ఈ శాంతమ్మ
ప్రస్తుతం తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఏ. శాంతికుమారి 1991 నుంచి 92 వరకూ నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. వయోజన విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత పెంచే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో చదువులమ్మగా శాంతికుమారి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. అక్కడి ప్రజలు నేటికీ శాంతికుమారిని యాది చేసుకుంటున్నారు.