వాటి నిర్మూలనకు కృషి చేయాలి..
చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ల్లో
మన ఊరు-మన బాధ్యత
గోడపత్రికల ఆవిష్కరణ..
ఆన్లైన్ బెట్టింగ్ ఆడిన, ఆడించిన చట్టరీత్య నేరం..
తిమ్మాపూర్ సిఐ గడ్డం సదన్ కుమార్..
చిగురుమామిడి, ఆంధ్రప్రభ : మత్తు పదార్థాలు, ఆన్ లైన్ బెట్టింగ్ ల నిర్మూలన ప్రజలందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని తిమ్మాపూర్ సిఐ గడ్డం సదన్ కుమార్ (CI Gaddam Sadan Kumar) తెలిపారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో తిమ్మాపూర్ సిఐ గడ్డం సదన్ కుమార్, ఎస్సై రేణికుంట సాయికృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలతో కలిసి గంజాయి, మత్తు పదార్థాలు నిర్మూలించడంలో మన ఊరు మన బాధ్యత అనే గోడపత్రికలను ఆవిష్కరించారు.
అనంతరం సీఐ సదన్ కుమార్ మాట్లాడుతూ… దేశ భవిష్యత్‌ను నిర్ణయించే యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు సరఫరాదారులు, ఉత్పత్తిదారులపై ఉక్కుపాదం మోపే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించినా, అమ్మినా, రవాణా చేసినా, సాగుచేసినా, ఆన్ లైన్ బెట్టింగ్ (Online betting) ఆడినా, ఇతరులతో ఆడించినా తమ దృష్టికి తీసుకురావాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మండలంలోని ఆయా గ్రామాలకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ లను కేటాయించామని, గ్రామంలో జరిగే కదలికలపై వారికి తగు సమాచారం అందిస్తూ సామాజిక బాధ్యతను నెరవేర్చాలన్నారు.

మత్తు పదార్థాల బారిన పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతను సీఐ కోరారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజలందరిపై ఉందని, మత్తు పదార్థాలు, ఆన్ లైన్ బెట్టింగ్ తో కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని పోలీస్ సిబ్బంది (Police personnel)కి సీఐ సూచించారు. మత్తు పదార్థాలను తీసుకోకుండా ఎప్పటికప్పుడు పాఠశాల విద్యార్థులకు, యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐ తెలిపారు. మత్తు పదార్థాలు సేవించిన వారిని యూరిన్ ను టెస్ట్ చేసి నిమిషాల్లో పట్టుకుంటామని, ఎవరూ తప్పించుకోలేరని సిఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తిరుపతి, పోలీస్ సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

