Elkathurthy ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలి

Elkathurthy ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • ఏఐఎస్ఎఫ్

ఎల్కతుర్తి (Elkathurthy), ఆంధ్రప్రభ: విద్యార్థులు, తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి ప్రణీత్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో పలు విద్యా సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బంది సురేష్‌కు వినతిపత్రం అందజేశారు.

ప్రణీత్ గౌడ్ మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఫీజుల నియంత్రణ చర్యలు అమలు కాకపోవడం ఆందోళనకరమని అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు 20 నుండి 30 శాతం వరకు ఫీజులు పెంచుతూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయని విమర్శించారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ ఆదాయంలో అధిక భాగాన్ని విద్య కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పాఠశాలలు నిర్దిష్ట షూ, టై, బెల్ట్, పుస్తకాలు ఒకే చోట కొనుగోలు చేయాలని ఒత్తిడి తెచ్చి అదనపు భారం మోపుతున్నాయని తెలిపారు. ఫైర్ సేఫ్టీ, భవన భద్రత, వెంటిలేషన్, మరుగుదొడ్లు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు వంటి మౌలిక సదుపాయాలు లేకుండానే అనేక పాఠశాలలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలకు అనుగుణంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర సాయిచందు, జిల్లా కోశాధికారి పెండ్యాల బండి, మండల నాయకులు శ్రీపతి రామ్ చరణ్, బుర్ర సుశాంత్, రావుల సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply