తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష
తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష
బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమాల పురోగతిపై చర్చ..
ఎస్ఎస్ఏ అమలులో నిర్లక్ష్యానికి తావులేదన్న కేసీ వేణుగోపాల్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత బలోపేతంపై ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో మంగళవారం కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, ఎస్ఎస్ఏ జాతీయ ఇన్చార్జ్ చల్లా వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలు, సంఘటన్ సృజన్ అభియాన్ (ఎస్ఎస్ఏ) అమలు పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంస్థాగత కార్యక్రమాలపై కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఎస్ఎస్ఏ అమలులో తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న కృషిని అభినందించారు.
అదే సమయంలో సంఘటన్ సృజన్ అభియాన్ అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా అమలు చేయాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. బూత్ స్థాయి నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సంస్థాగత లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా కార్యాచరణ కొనసాగించాలని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
