ఇంద్రకీలాద్రిపై ఎకో ఫ్రెండ్లీ ఉద్యమానికి శ్రీకారం

ఇంద్రకీలాద్రిపై ఎకో ఫ్రెండ్లీ ఉద్యమానికి శ్రీకారం

కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తులకు ఉచిత కాటన్ బ్యాగుల పంపిణీ
ప్లాస్టిక్, నాన్-డిగ్రేడబుల్ కవర్ల వినియోగం తగ్గించాలి
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..
గుడ్డ సంచుల తయారీ యూనిట్లకు ప్రభుత్వ సబ్సిడీలు అవసరం
దాతలు ముందుకు వచ్చి ఉదారత చూపించాలి

దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం పర్యావరణ హిత కార్యక్రమం నిర్వహించారు. కాసరనేని కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా ఎకో ఫ్రెండ్లీ కాటన్ బ్యాగులను పంపిణీ చేశారు. అమ్మవారి ప్రసాదాలు, లడ్డూలు కొనుగోలు చేసే భక్తులు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులను వినియోగించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్, నాన్-డిగ్రేడబుల్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి, నీరు, పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్, గుడ్డ సంచుల వినియోగం పెరిగితే కాలుష్య నియంత్రణకు గణనీయమైన తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి వ్యాపార సంస్థలో కూడా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గుడ్డ సంచుల తయారీ యూనిట్లకు ప్రభుత్వం సబ్సిడీలు అందించి వాటి ధరలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీంతో ప్రజలు పెద్దఎత్తున గుడ్డ సంచులను వినియోగించే అవకాశం ఉంటుందని తెలిపారు.

దుర్గగుడిలో లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం భక్తులు, దాతలు గుడ్డ సంచులను విరాళంగా అందించాలని చైర్మన్ కోరారు. ఒకవైపు అమ్మవారి చిత్రం, మరోవైపు దాతల పేర్లు ముద్రించి సంచులను అందించినా దేవస్థానం స్వీకరించి భక్తులకు పంపిణీ చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇంద్రకీలాద్రి నుంచే ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి గుడ్డ సంచుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని భక్తులకు, ప్రజలకు బొర్రా గాంధీ పిలుపునిచ్చారు.

Leave a Reply