మొక్కలు నాటే ఉద్యమం చేద్దాం..

మొక్కలు నాటే ఉద్యమం చేద్దాం..

  • రేపటి తరాన్ని రక్షించుకుందాం..
  • ఇందిరమ్మ ఇండ్ల వద్ద మొక్కల పెంపకం అనివార్యం..
  • ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్..

సిద్దిపేట బ్యూరో, ఆంధ్రప్రభ : మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమం వలె చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని ఆక్సిజన్ పార్కులో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం కుగ్రామంగా మారుతున్న వేళ పర్యావరణాన్ని రక్షించడానికి మొక్కలు నాటడమే శరణ్యం ఆన్నారు. ఢిల్లీలో కాలుష్యం వల్ల నివసించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాలుష్యాన్ని ఎదుర్కోవడం కోసం ఈవి పాలసీ తీసుకొచ్చారని చెప్పారు. గతంలో ఎక్కడ చూసినా రకరకాల చెట్లు ఉండేవని , కోతులు చెట్లపై పండ్లను ఆహారంగా తీసుకునేవని తెలిపారు.

ఇప్పుడు అవి లేకపోవడం వల్ల కోతులు గ్రామాల్లోకి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఇందిరమ్మ ఇల్లు కడుతున్నామని చెప్పారు. ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని సూచించారు .ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటాలని అన్నారు. ప్రభుత్వం గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచాలు ఇచ్చేటప్పుడు తాటి చెట్టు ,ఈత చెట్టు నాటిస్తుందని తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పర్యావరణం దెబ్బతింటున్న సందర్భంలో భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్ లను బ్యాగుల్లో పెట్టుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ మొదలగు వ్యాధులు వ్యాపిస్తున్నట్టు పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా అనుగుణంగా పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారిపై ఈ సంవత్సరం ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, సిపి రష్మీ పెరుమాళ్, జిల్లా అటవీ శాఖ అధికారి సంధ్యారాణి , జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ , అదనపు డిసిపి సుభాష్ చంద్రబోస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, స్థానిక సర్పంచ్ బాలరాజు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి రవీందర్, జిల్లా అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటుతామని సామూహిక ప్రతిజ్ఞ చేశారు.

Leave a Reply