DWCRA Women Loans | డ్వాక్రా మహిళలకు వేగంగా రుణాల మంజూరు

DWCRA Women Loans | డ్వాక్రా మహిళలకు వేగంగా రుణాల మంజూరు
DWCRA Women Loans | రూ.6 వేల కోట్ల రుణాల పంపిణీ
డిజిటల్ సేవలతో స్త్రీనిధి ముందడుగు
మహిళా పారిశ్రామికవేత్తల తయారీ లక్ష్యం
ఏసీఎల్పీ సర్వేతో అర్హుల గుర్తింపు
DWCRA Women Loans | అమరావతి, ఆంధ్రప్రభ : డ్వాక్రా సభ్యులకు కేవలం 48 గంటల వ్యవధిలోనే రుణం అందజేస్తూ వారి వ్యాపారాభివృద్ధికి తమ సంస్థ కృషి చేస్తుందని స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జీవీబీడీ హరిప్రసాద్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వేగంగా, సులభంగా రుణాలు అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. మంగళవారం ఆయన ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడారు.
డ్వాక్రా సంఘాల మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు, పశుపోషణ, వ్యవసాయ అనుబంధ రంగాలు, కుటుంబ అవసరాలు, స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం తమ సంస్థ వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని హరిప్రసాద్ తెలిపారు. స్త్రీనిధి ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, కుటుంబ ఆదాయం పెంపు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని చెప్పారు. బ్యాంకుల తరహాలో ఎక్కువ రోజులు వేచి చూడకుండా వేగంగా రుణాలు అందించడమే స్త్రీనిధి ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.
రూ.6 వేల కోట్ల రుణాలు
ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ద్వారా రూ.6 వేల కోట్ల రుణాలను అందించామని హరిప్రసాద్ స్పష్టం చేశారు. 93 వేల కోట్ల ఎన్పీఏ సాధించినట్లు తెలిపారు. అర్హులకే రుణాలు అందాలనే ఉద్దేశంతో డిజిటల్ సేవలకు శ్రీకారం చుట్టామన్నారు. డిజిటల్ యాప్ ద్వారా రికవరీతోపాటు లెండింగ్ కార్యకలాపాలు చేపడుతున్నామని చెప్పారు.
డ్వాక్రా సంఘంలో మంచి పొదుపు, రుణ చెల్లింపుల చరిత్ర ఉన్న సభ్యులకే రుణాలను మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వ్యాపారాలు, కిరాణా దుకాణాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ, కుట్టు మిషన్లు, చేతివృత్తులు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు స్త్రీనిధి రుణం వినియోగించుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారని ఆయన తెలిపారు.
‘స్త్రీనిధితో మహిళల్లో పొదుపు అలవాటు పెరగడమే కాకుండా నాయకత్వ లక్షణాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబ నిర్ణయాల్లో మహిళల పాత్ర పెరగడం, గ్రామీణ స్థాయిలో చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందడం, అప్పుల బారిన పడకుండా ప్రత్యామ్నాయ రుణ వనరు లభించడం వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు.
ఏసీఎల్పీ సర్వే
డ్వాక్రా సంఘ సభ్యుల్లో అసలైన అర్హులను గుర్తించేందుకు ప్రత్యేకంగా జీవనోపాధి రుణ వార్షిక ప్రణాళిక (ఎసీఎల్పీ) సర్వే నిర్వహించి ఎవరికైతే రుణం అవసరమో వారికే రుణాలు ఇస్తున్నామని హరిప్రసాద్ తెలిపారు. యూనిట్లు ఏర్పాటు చేయకుండా రుణం పొందే అవకాశమే లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సభ్యులు ఏర్పాటు చేసే సంస్థలు, యూనిట్లను ట్యాగింగ్, మ్యాపింగ్ చేయడం వల్ల రుణ వాయిదాల చెల్లింపులో ఎటువంటి లోటుపాట్లు ఉండవన్నారు. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల రూపాయలు రుణాలు అందజేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
మహిళా పారిశ్రామికవేత్తలుగా….
స్వయం సహాయక సంఘాల సభ్యులనే మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడమే ప్రభుత్వ ఉద్దేశమని హరిప్రసాద్ తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు ఎంతో రాణిస్తున్నారని, కుటీర పరిశ్రమలతో వేలాది మంది ఉపాధి పొందడమే కాక మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల మందిని ఎంటర్ప్రెన్యూర్లుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు 50 వేల మందికి పైగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని హరిప్రసాద్ వివరించారు. డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి ఒక వరమని ఆయన అభిప్రాయపడ్డారు.
