బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే వెడ్మబొజ్జు

కడెం, ఆంధ్రప్రభ: బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. బుధవారం కడెం మండలంలోని పలు విషాద ఘటనల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలను ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జాలిగామ వినయ్ కుటుంబం, కడెం ప్రాజెక్టులో మృతి చెందిన నాగుల రాజు కుటుంబం, దుబాయ్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించిన అబ్దుల్ రఫిక్ కుటుంబంతో పాటు ఇతర బాధిత కుటుంబాలను కలిసి ఓదార్చారు.

అదేవిధంగా కన్నాపూర్ గ్రామ పరిధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనంతరం తీవ్ర అలర్జీతో కడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిర్మల్ జిల్లా ఆర్టీఏ సభ్యుడు తుమ్మల మల్లేష్ యాదవ్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ భూషణ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.