ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 4(1) (ఆడియోతో…)

మహాభారతం శాంతిపర్వంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

కోపో మైత్రా వరుణ: శాపోవ తార్కికస్య మునే:
సంచింత్యతే యది మనాక్‌ శత్రోరపి మాస్తు శక్రపదమ్‌

అగస్త్య మహర్షి కోపాన్ని గౌతమ మహర్షి శాపాన్ని తలుచుకున్నచో ఇంద్ర పదవి శత్రువుకు కూడా వద్దనిపిస్తుంది.

అగస్త్య మహర్షి కోపం :
నహుష మహారాజు కొంతకాలం స్వర్గంలో ఇంద్రుడిగా పరిపాలించాడు. ఒకనాడు నారదుడు నీవు ఇంద్రుడివా, మహేంద్రుడివా అని ప్రశ్నించగా రెండింటికి తేడా కూడా తెలియని ఇంద్రుడు వివరించమని అడుగగా సచీదేవి సమేతంగా సింహాసనాన్ని అధిష్టిస్తే మహేంద్రుడవు, ఒంటరిగా అధిష్టిస్తే ఇంద్రుడవని నారదుడు బదులిచ్చెను.
నీ భార్య సచీదేవి ఉండగా ఎందువలన ఒంటరిగా సింహాసనాన్ని అధిష్టించావని నారదుడు ప్రశ్నించగా ఇంద్రుడు సచీదేవిని ఇంద్రసభకు రావాల్సిందిగా కోరెను. మహేంద్రుడిలా పిలిస్తే వస్తానని సచీదేవి సమాధానమిచ్చెను. విషయం అర్థంకాని ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని సందేహం అడిగెను. దానికి బృమస్పతి నీవు ఒంటరిగా వెళ్ళక సప్తఋషులు మోస్తున్న పల్లకి అనగా బ్రహ్మరథంలో వెళితే సచీదేవి కూడా పల్లకిలో ఆసీనురాలవుతుందని ఇంద్రునితో పలికెను. అప్పుడు ఇంద్రుడు సప్త ఋషులను ఆహ్వానించి తన ప ల్లకిని మోయమని కోరగా అది ఇంద్రుడి హక్కు కావున వారు ఆ పల్లకిని మోయసాగిరి. సచీదేవి వద్దకు వెళ్తున్న సంతోషంలో ఉన్న ఇంద్రుడు ”శీఘ్రం సర్ప సర్ప” అనగా త్వరగా నడవండి అంటూ వివేకాన్ని మరచి తన కాళ్ళతో ముందరున్న సాక్షత్‌ అగస్త్య మహర్షిని తాకాడు. ఆగ్రహించిన అగస్త్యుడు ఇంద్ర పదవి వచ్చినా ధర్మాన్ని, ఇంద్రియజయాన్ని మరచి స్త్రీ లోలుడవై అతిగా ప్రవర్తించినందున తననే సర్పముగా మారమని శపించగా ఇంద్రుడు అజగరమై(కొండచిలువ) భూమి మీద పడ్డాడు.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *