బడి ఈడు పిల్లల్ని హిందూ హైస్కూల్లో చేర్పించండి..

బడి ఈడు పిల్లల్ని హిందూ హైస్కూల్లో చేర్పించండి..
భవానిపురం, ఆంధ్రప్రభ : స్థానిక ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్‌లో బడి ఈడు పిల్లలను చేర్పించాలని 52వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) పిలుపునిచ్చారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆధునిక సౌకర్యాలు ఉన్న ఈ పాఠశాలను తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ విద్యాశాఖ, పాఠశాల మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు గత రెండు రోజులుగా ఇంటింటికి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎన్‌సీసీ, క్రీడలు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ వంటి సదుపాయాలు, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను వివరించారు. శనివారం మల్లికార్జునపేటలోని చంటి వాటర్ ప్లాంట్ వద్ద నుంచి ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని కార్పొరేటర్ చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని తెలిపారు.
సుమారు 125 ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ హైస్కూల్ ఒకప్పుడు నగరానికి విద్యా దిక్సూచిగా నిలిచిందని, ఆ ప్రతిష్ఠను తిరిగి తీసుకురావడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాల బలోపేతానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు డా. ఎస్. వెంకటేశ్వరరావు, వి. అరుణకుమారి, జే. ఆనందకుమార్, ఎస్. శ్రీనివాసరావు, జి. పురుషోత్తం, ఐ. శశికళ, కె. కృష్ణ, పణి, బి. బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
