Temple | కట్టపుట్టాలమ్మ ఆలయం కూల్చివేత..
- డీఎఫ్ఓని కలిసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
Temple | తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలోని బిటిఆర్ కాలనీ 5వ లైనులో ఉన్న కట్టపుట్టాలమ్మ స్వయంభూ దేవాలయం కూల్చివేతపై వివాదం రేగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శుక్రవారం తిరుపతి జిల్లా అటవీశాఖ అధికారి (DFO) సాయిబాబాను కలసి, కాలనీ ప్రజల అభ్యంతరాలు, ఆకాంక్షలను వివరించారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా అటవీ శాఖ సిబ్బంది అకస్మాత్తుగా వచ్చి అమ్మవారి గుడి నిర్మాణాన్ని కూల్చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఎమ్మెల్యే తెలిపారు.

స్వయంభూగా వెలిశిన అమ్మవారి వద్ద కాలనీ ప్రజలు సొంతంగా గుడి నిర్మించారు. ప్రజల విశ్వాసం, భావోద్వేగాలకు భంగం కలిగిందని నాని డిఎఫ్ఓ దృష్టికి తీసుకువచ్చారు. దేవాలయ పునర్నిర్మాణానికి అటవీశాఖ సహకారం అందించాలని కాలనీ ప్రజల తరఫున ఎమ్మెల్యే పులివర్తి నాని అర్జీ సమర్పించారు. ప్రజా విశ్వాసం దృష్ట్యా సమస్యను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. స్పందించిన డిఎఫ్ఓ సాయిబాబా, స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తానని, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

