Cyclone | తుఫాను హెచ్చరిక..

Cyclone | తుఫాను హెచ్చరిక..

Cyclone, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఈమధ్య వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. బాగానే ఉంది అనుకునే లోపే మళ్లీ వర్షాలు పడడం చూస్తున్నాం. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో (Hindu Mahasamudram) ఒకేసారి మూడు కీలక వాతావరణ వ్యవస్థలు బలపడ్డాయి. దీని ప్రభావం వలన తమిళనాడుపై పడిందని.. తుపాను గండం పొంచి ఉందని వాతావరణ కేంద్రం తెలియచేసింది. రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

అండమాన్ సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ మలేషియా, (Malesiya) మలక్కా జలసంధి సమీపంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. మరో వైపు కన్యాకుమారి ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో కన్యాకుమారి సముద్రం, నైరుతి శ్రీలంక జలాల్లో కొత్త అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలియచేశారు. అరేబియా సముద్రంలోని మూడో ఆవర్తనం కూడా స్థిరంగా ఉందని, ఈ మూడు వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

తమిళనాడులో (Tamilnadu) విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం, 15 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 29 వరకు కన్యాకుమారి, తూత్తుకుడి, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలు పాటించాలని చెప్పారు. ఇక ఈ తుఫాను ప్రభావం ఏపీలోని దక్షిణ కోస్తా పై తీవ్ర స్థాయిలో ఉంటుందని అంచనా వేశారు.

Leave a Reply