CRICKET | ఏపీఎల్‌లో డబుల్ ధమాకా

CRICKET | ఏపీఎల్‌లో డబుల్ ధమాకా

భీమవరం బుల్స్ భారీ ఛేజ్‌తో సంచలన విజయం..
రేవంత్ రెడ్డి తుఫాన్ సెంచరీ
రాయలసీమపై వైజాగ్ లయన్స్ జయభేరి..
హనీష్ వీరారెడ్డి మరోసారి మెరుపులు.
ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతున్న పోటీలు..

CRICKET |కడప, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5లో భాగంగా కడపలోని వైయస్ రాజారెడ్డి స్టేడియం వేదికగా గురువారం జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు ప్రేక్షకులకు క్రికెట్ వినోదాన్ని పంచాయి. తొలి మ్యాచ్‌లో భీమవరం బుల్స్ అద్భుత ఛేజింగ్‌తో విజయవాడ సన్ షైనర్స్‌ను చిత్తు చేయగా, రెండో మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాయల్స్ ఆఫ్ రాయలసీమపై ఘన విజయం సాధించింది.

సెంచరీతో చెలరేగిన రేవంత్.. బుల్స్‌కు భారీ విజయం..

రోజు తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భీమవరం బుల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విజయవాడ సన్ షైనర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ కేవలం 29 బంతుల్లోనే 73 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. జహీర్ అబ్బాస్ 25 బంతుల్లో 48 పరుగులు, హర్షవర్ధన్ 23 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. భీమవరం బౌలర్లలో పీవీఎస్‌ఎన్ రాజు 3 వికెట్లు, రవితేజ, యశ్వంత్ చెరో రెండు వికెట్లు తీశారు. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలినా, రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటంతో మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. కేవలం 61 బంతుల్లో 126 పరుగులు చేసి బౌండరీల వర్షం కురిపించాడు. మరో ఎండ్‌లో రవికిరణ్ 24 బంతుల్లో 46 పరుగులతో అండగా నిలిచాడు. వీరి ధాటికి భీమవరం బుల్స్ 17.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.అద్భుత సెంచరీతో మ్యాచ్‌ను మలుపుతిప్పిన కే. రేవంత్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

హనీష్ హాఫ్ సెంచరీ.. వైజాగ్ లయన్స్ జయభేరి…

రోజు రెండో మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సింహాద్రి వైజాగ్ లయన్స్‌కు ఆరంభంలోనే కెప్టెన్ రికీ భూయ్ వికెట్ కోల్పోయినా, హిమకర్, హనీష్ వీరారెడ్డి జట్టును గట్టెక్కించారు. హనీష్ వీరారెడ్డి కేవలం 22 బంతుల్లో 50 పరుగులు చేసి మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. హిమకర్ 27 బంతుల్లో 47 పరుగులతో రాణించాడు. దీంతో వైజాగ్ లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్ ఆఫ్ రాయలసీమకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు విఫలమైనా ధ్రువ్ కుమార్ 31 బంతుల్లో 52 పరుగులు, జీఎస్‌పీ తేజ 47 బంతుల్లో 62 పరుగులు చేసి పోరాడారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమవడంతో జట్టు 19 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌట్ అయింది. వైజాగ్ బౌలర్లలో వినయ్ కుమార్ 3 వికెట్లు, గిరినాథ్ రెడ్డి 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.బ్యాట్‌తో మరోసారి మెరిసిన హనీష్ వీరారెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.