రెండో రోజు కొనసాగిన సీపీఎం దీక్షలు

రెండో రోజు కొనసాగిన సీపీఎం దీక్షలు
కర్నూలు బ్యూరో,ఆంధ్రప్రభ : కర్నూలు నుంచి అమరావతి వరకు రైలు సేవలు అందించాలని, రైల్వే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం చేపట్టిన నిరవధిక దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. కర్నూలు రైల్వే స్టేషన్(Kurnool Railway Station) శనివారం ప్రారంభమైన ఈ దీక్షలను ఆదివారం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పీ. నిర్మల(P. Nirmala) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం న్యూ సిటీ కార్యదర్శి టి. రాముడు అధ్యక్షత వహించారు.
జిల్లా నుంచి రాజధాని వరకు కనీస రవాణా సౌకర్యం కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని, రాష్ట్ర విభజనకు మద్దతిచ్చినప్పటికీ ప్రజలకు కనీస సేవలు కూడా అందించలేకపోయిందని పీ. నిర్మల విమర్శించారు. పలు రైలు సేవల పునరుద్ధరణ, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్(Railway Line) పనులు పూర్తి చేయడం వంటి కీలక డిమాండ్లను ఆమె ప్రజల తరఫున వినిపించారు. దీక్షలకు మద్దతు తెలుపుతూ మాట్లాడిన చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ తదితరులు “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా అవసరాలను విస్మరించాయి.
రాయలసీమ అభివృద్ధికి రైల్వే సేవలు కీలకం” అని వాఖ్యానించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు(MD Anand Babu), నగేష్, సాహితీ, కార్మిక, మహిళా యువజన సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైల్వే సేవలు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందంటూ సీపీఎం నేతలు ప్రకటించారు.
