పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలి..

పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలి..

తెలంగాణాలో వివిధ సాకుల‌తో జ‌న‌సేన ప్ర‌బంజ‌నాన్ని ఆప త‌ర‌మా?
జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర‌కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌, ఆంధ్రప్రభ : జ‌న‌సేన పార్టీ తెలంగాణాలో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ- జనసేన సాధక్‌ సమ్మేళనానికి అనుమ‌తి నిరాక‌రించ‌టం దుర‌దృష్ట‌క‌మ‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ అర‌చేతిని అడ్డుపెట్టి సూర్యోద‌యాన్ని ఆపాల‌ని ప్ర‌య‌త్నించ‌టం ఎంత అవివేక‌మో.. తెలంగాణాలో జ‌న‌సేన స‌భ నిర్వ‌హ‌ణ‌ను అడ్డుకొని జ‌న‌సేన ప్ర‌బంజ‌నాన్ని అడ్డుకోవాల‌ని చూడ‌టం అంతే అవివేక‌మ‌ని అభివ‌ర్ణించారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్ లో నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ కంపెనీల సమావేశాలు జరుగుతూనే ఉంటాయని. అప్పుడు ఎప్పుడూ రాని పార్కింగ్ సమస్య జనసేన పార్టీ కార్యక్రమానికి అడ్డంకిగా చూపి నిరాకరించడం స‌రైన దోర‌ణి కాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అనుమతి నిరాకరించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్యే..

కుంటి సాకులు చెబుతూ అధికారులు, ప్ర‌భుత్వ యంత్రాగం జ‌న‌సేన స‌భ‌ను అడ్డుకోవాల‌ని చూస్తున్నార‌ని బాలాజి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, సభ నిర్వహించాలనుకున్న జనసేనపై మాత్రమే ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సెలెక్టివ్ నేరేటివ్స్, హాఫ్ కట్ వీడియోలను ప్రచారం చేస్తూ ముందుగానే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విరాళం అందించినప్పుడు ప్రాంతీయత గుర్తుకు రాలేదా అని బాలాజి ప్రశ్నించారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సభ నిర్వహించాలనుకున్నప్పుడు మాత్రమే ప్రాంతీయ భావోద్వేగాల అంశాన్ని ముందుకు తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీశారు. తెలంగాణ సాధక్ సమ్మేళనానికి అనుమతి నిరాకరించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్యేనని పెంటేల బాలాజి స్పష్టం చేశారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్ లో మిగతా అన్ని కార్యక్రమాలకు లేని పార్కింగ్ సమస్యలు, కేవలం జనసేన సభకే ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలని, ఉమ్మడి ఆంధ్ర లో అన్న దమ్ముల్లా ఉన్న వాళ్ళు విడిపోతే బాధతో 11 రోజులు తినలేదు అని కళ్యాణ్ గారు అంటే దాన్ని కూడా తప్పుగా ఎలా చూస్తారు, తెలంగాణ ఏర్పడ్డాక రాజకీయ పార్టీ లు రాజకీయ నాయకులు బాగుపడ్డారు కానీ ప్రజలకు ఏమి ఒరిగింది లేదు అని బాలాజి ఎద్దేవా చేసారు.

హాఫ్ కట్ వీడియోలతో కుట్రలు చేస్తూ, ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోకుండా.. శాంతియుతంగా సభ నిర్వహించాలనుకున్న జనసేనపై ఆంక్షలు విధించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణాలో జనసేన పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని బాలాజి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply