అనాజీపురంలో బైక్ ని ఢీకొట్టిన కారు

అనాజీపురంలో బైక్ ని ఢీకొట్టిన కారు

  • ముగ్గురికి గాయాలు

మోత్కూరు, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆనాజిపురం గ్రామ పరిధిలో హైవే 930 పి పై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బుజిలాపురం గ్రామానికి చెందిన దయ్యాల వెంకన్న తన భార్య కళమ్మ, కుమారుడు ఉపేందర్‌తో కలిసి బైక్ (టీజీ 30ఏ 4614) పై తమ స్వగ్రామం నుంచి అమ్మనబోలు వైపు వెళ్తున్నారు.

ఈ క్రమంలో ఆనాజిపురం చౌరస్తా వద్ద బైక్ రోడ్డు దాటుతుండగా తిరుమలగిరి వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు (టీజీ 28 ఏ 8290) బైక్‌ను ఢీకొట్టింది. కారు ఖమ్మం జిల్లా మణుగూరు కి చెందిన దించనాల కమలాచారికి చెందినదిగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ లో కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అనాజీపురంలో ఆగని ప్రమాదాలు….పట్టించుకోని అధికారులు

930 పి హైవే మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.అనాజీపురం చౌరస్తాలో గత కొంతకాలంగా వరుస ప్రమాదాలు జరగడంతో పాటు కొందరు మృత్యువాత పడుతున్నారు. అనాజీపురం-నార్కెట్ పల్లి రూట్ లోని నుండి వచ్చే వాహనాలకు ,నేరుగా హైవే నుండి వచ్చే వాహనాలు పదేపదే ఢీకొట్టడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అనాజీపురం చౌరస్తాలో పెద్ద ఎత్తున స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు స్పీడ్ లిమిట్ సంబంధించి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply