ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం..

  • స్వాతంత్ర్య వేడుకలకు పకడ్బందీ ప్రణాళిక.. అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

( పాయికాపురం, ఆంధ్రప్రభ ) ; ఎన్టీఆర్ జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయి వేడుకలకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. వేడుకలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను సమన్వయంతో, పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌తో కలిసి స్టేడియంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ మాట్లాడుతూ, విజయవాడ కేంద్రంగా ఉన్న మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న నెలల్లో ఇదే వేదికగా మరో రెండు భారీ కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్ణయించినందున, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా స్టేడియంలో పటిష్టమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్నందున వేడుకలకు హాజరయ్యే వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైన్‌ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేసి వర్షం కారణంగా కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. తాగునీటి వసతి, సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్, వైద్య శిబిరం తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, వాటిని కార్యక్రమానికి ముందు మరోసారి పరిశీలించాలని సూచించారు.

వేడుకల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. స్టేడియంలో విద్యుత్ సంబంధిత అన్ని సదుపాయాలను ముందుగానే తనిఖీ చేసి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. వేడుకలకు సుమారు 4 వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున పోలీసు శాఖ సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదనంగా ప్రజలు వేడుకలను వీక్షించేందుకు వచ్చినప్పటికీ ఎలాంటి ఒత్తిడి, ఇబ్బంది కలగకుండా రాకపోకలను క్రమబద్ధీకరించాలని సూచించారు.

భద్రతా చర్యల్లో భాగంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అవసరమైన మేరకు భారీ కేడింగ్ ఏర్పాటు చేసి, ప్రేక్షకులు, ఆహ్వానితులు, వీఐపీలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పెరేడ్‌ను క్రమశిక్షణతో, ఆకట్టుకునేలా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పోలీస్, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్‌క్రాస్, సోషల్ వెల్ఫేర్, ఫైర్, మెడికల్ అండ్ హెల్త్, ఐసీడీఎస్, అగ్రికల్చర్, విజయవాడ నగరపాలక సంస్థ తదితర శాఖలు పెరేడ్‌లో పాల్గొననున్నట్లు తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలతో పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బైక్ విన్యాసాలు, అమరావతిపై రూపొందించిన ప్రత్యేక గీతం ప్రదర్శన, సిద్ధార్థ కళాశాల విద్యార్థుల డ్రమ్స్ ప్రదర్శన, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న శకటాల ప్రదర్శనను అత్యంత ఆకర్షణీయంగా, సమాచారాత్మకంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల ద్వారా ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు, గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను శకటాల ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలా ప్రదర్శనలు ఉండాలని సూచించారు.

ప్రతి శాఖ తమకు కేటాయించిన శకటాన్ని ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా విజువల్స్, సందేశాలతో రూపొందించాలని ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లాకు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని పేర్కొన్న కలెక్టర్, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే తనిఖీ చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి అలసత్వానికి తావులేదని, ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, అదనపు డిసిపి జి.రామకృష్ణ, ఏడీఈపీఆర్ ఎన్. వెంకటరమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, విజయవాడ నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు, పోలీసు శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.