కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆడే ప్రకాష్ డిమాండ్ చేశారు.
మంగళవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు పీఆర్‌సీ, డీఏను వెంటనే ప్రకటించాలని, బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరారు.
ఎస్ఎస్‌ఏలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టైం స్కేల్ మంజూరు చేయాలని, ట్రైబల్ వెల్ఫేర్‌లో పనిచేస్తున్న సీఆర్‌టీలకు రెగ్యులర్‌గా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమ్మె కాలపు జీతాలను కూడా మంజూరు చేయాలని కోరారు.
కేజీబీవీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగులు, ఉపాధ్యాయినులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కనీస టైం స్కేల్ మంజూరు చేయాలని కోరారు.
ప్రతి కేజీబీవీ పాఠశాలలో వార్డెన్, కేర్‌టేకర్ పోస్టులను మంజూరు చేయాలని, ఎక్కడైతే కేజీబీవీ పాఠశాలల్లో జూనియర్ కళాశాలలు ప్రారంభించారో అక్కడ ప్రిన్సిపాళ్లు, పీడీలు, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ ఉపాధ్యాయినులకు కల్పిస్తున్న 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్, 27 రోజుల క్యాజువల్ లీవ్ సౌకర్యాలను కేజీబీవీ ఉపాధ్యాయినులకు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తవుతున్నప్పటికీ కేజీబీవీ ఉద్యోగులు, ఉపాధ్యాయినులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. వారి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.
2026 సంవత్సరంలోనైనా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ టీఎస్ సంఘం జైనూర్, సిర్పూర్ (యు) మండలాల అధ్యక్షులు తులసీరామ్, భీమన్న, జంగు, మోహన్, శ్రీనివాస్‌తో పాటు సంఘ నాయకులు పాల్గొన్నారు.
