వైసీపీ నేతల విమర్శలు హాస్యాస్పదం: బుద్ధా వెంకన్న

భవానిపురం, ఆంధ్రప్రభ: వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ చాలాకాలం తర్వాత బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జబ్బలు చరిచి, తొడలు కొట్టిన నేతలు అధికారం కోల్పోయిన తర్వాత భయంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలే గన్‌ను పాయింట్‌ బ్లాంక్‌లో పెట్టినట్లుగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు.

నారా లోకేశ్‌ ఉత్తర కుమారుడు కాదని, కలియుగ అభిమన్యుడని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఉత్తర కుమారులు ఎవరో తెలుగు ప్రజలకు తెలుసన్నారు. నాని, వంశీలు చంద్రబాబు, లోకేశ్‌ను పోటీకి రావాలని సవాల్‌ చేసినా.. చంద్రబాబు నిలబెట్టిన రాము, యార్లగడ్డ వెంకట్రావుల చేతిలో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు.

ప్రజలు ఇప్పటికే వైసీపీకి బుద్ధి చెప్పారని, అయినా అదే తరహాలో మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ పార్టీకి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

డీఎస్సీపై చర్చకు సిద్ధం

డీఎస్సీ అంశంపై బహిరంగ చర్చకు మంత్రి నారా లోకేశ్‌ సిద్ధమని సవాల్‌ చేసినా వైసీపీ అధినేత జగన్‌ స్పందించలేదని బుద్ధా వెంకన్న అన్నారు. డీఎస్సీ ద్వారా 17 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అక్రమాలంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లోకేశ్‌తో కాకుండా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో జగన్‌ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. 17 వేల మంది యువత కష్టాన్ని అవమానించడం తగదన్నారు.

అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తోందని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని వెంకన్న తెలిపారు. ఎన్నికల హామీల మేరకు సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచడం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్‌ హయాంలో నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆరోపించారు.

రెడ్‌బుక్‌పై స్పందన

లోకేశ్‌ రెడ్‌బుక్‌ చూసి వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయని బుద్ధా వెంకన్న అన్నారు. మహిళలను, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించిన వారిపైనే రెడ్‌బుక్‌ ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు.

వైసీపీ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న సమయంలో వాటిని అడ్డుకునేందుకు జగన్‌ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. లోకేశ్‌ పెట్టుబడులు తీసుకురావడం చూసి ఓర్వలేక నాని, వంశీలతో విమర్శలు చేయిస్తున్నారని అన్నారు.

వైసీపీ నేతలు తమ వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి గట్టి గుణపాఠం చెబుతారని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.