డ్రగ్స్ రహిత నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి..

డ్రగ్స్ రహిత నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి..

యువతను మాదకద్రవ్యాల నుంచి కాపాడటం ప్రధాన లక్ష్యం..
డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు..
పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు…
డ్రగ్స్ అలవాటు జీవితం పతన దిశగా నడిపిస్తుంది..
యువత కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలి..
డ్రగ్స్ ఫిర్యాదులకు 1902, 1972 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు…
జిల్లా కలెక్టర్..జిల్లా ఎస్ పి..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లాఎస్ పి సునీల్ షోరాణ్ లు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని మాదక ద్రవ్యాల నియంత్రణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారకుండా కాపాడటం అత్యంత అవసరమన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, సామాజిక దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ సరఫరా, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ, వారు చెడు అలవాట్లకు లోనుకాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజం మొత్తం కలిసి పనిచేసినప్పుడే డ్రగ్స్ సమస్యను నిర్మూలించగలమని ఆమె స్పష్టం చేశారు.

డ్రగ్స్ ప్రభావం – హెచ్చరిక..

డ్రగ్స్ అలవాటు వ్యక్తిని క్రమంగా పతన దిశగా నడిపిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. తాత్కాలిక ఆనందం కోసం ప్రారంభమయ్యే ఈ అలవాటు, ఆర్థిక, నైతిక విలువలను దెబ్బతీస్తుందన్నారు. స్నేహితుల ప్రభావంతో మరింత మందిని ఈ దుష్ప్రవర్తనలోకి లాగడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబాలపై ప్రభావం…

డ్రగ్స్‌కు బానిసైన వారివల్ల కుటుంబాలు తీవ్రంగా దెబ్బతింటాయని కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతూ, చివరకు పిల్లలను పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

యువతకు సందేశం..

విద్యార్థులు కష్టపడి చదివి, తల్లిదండ్రులు, గురువులకు గర్వకారణంగా నిలవాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా జీవిస్తూ, దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఫిర్యాదు & సహాయం..

డ్రగ్స్ వినియోగం లేదా విక్రయాలపై సమాచారం ఉన్నవారు వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. ఇందుకోసం 1902, టోల్ ఫ్రీ నంబర్ 1972 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

డ్రగ్స్ ఉపయోగం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు…

డ్రగ్స్ వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు. నాడీ వ్యవస్థకు నష్టం కలగడంతో పాటు రక్తపోటు పెరగడం, దంత సమస్యలు వంటి అనారోగ్యాలు తలెత్తుతాయని వివరించారు.

జాగ్రత్తలు చాలా అవసరం..

యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ, డ్రగ్స్ సమస్య సమాజం మొత్తం బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మద్యం, ధూమపానం, అధిక మొబైల్ వినియోగం వంటి వ్యసనాలనూ నివారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థలు తమ పరిధిలో ఇలాంటి కార్యకలాపాలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని, ఈ అవగాహన సందేశాన్ని సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

అంతకుముందు ఈ ఎల్ ఐ టీ ఈ యాంటి నారకోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోరసెమెంట్ ఈగల్ బృందం ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్ట, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుండి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలు వరకు నిర్వహించబడింది. ఈ ర్యాలీలో కలెక్టర్, ఎస్పీలతో పాటు నంద్యాల సబ్‌డివిజన్ ఏఎస్పీ ఎం. జావళి ఆల్ఫోన్స్‌, ఈగల్ బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply