అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి

అధికారులకు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశం

భీమవరం, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.

జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బి. శివన్నారాయణ రెడ్డి, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి ఎ. వెంకటలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్. వెంకటేశ్వరరావు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీ పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవాలని సూచించారు. అర్జీలు పునరావృతం కాకుండా స్థిరమైన పరిష్కారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.


అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి

ఆకివీడు మండలం పెదకాపవరం గ్రామానికి చెందిన జి. లక్ష్మీ మానస తనకు ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో 1బీ, అడంగల్‌లో 2.72 ఎకరాలు మాత్రమే నమోదైందని, మిగిలిన 28 సెంట్ల భూమిని రీసర్వే చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరారు.

వీరవాసరం మండలం అండలూరు గ్రామానికి చెందిన కుసుమలక్ష్మి తనకు 2024లో మంజూరైన 72 గజాల ఇంటి స్థలాన్ని ఇప్పటికీ చూపించలేదని, సరిహద్దులు గుర్తించి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

వీరవాసరం మండలం కొణితివాడ బుధరాయుడు చెరువు నివాసులు గ్రామంలో లో, హై వోల్టేజ్ సమస్యతో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, నాలుగు నెలల క్రితం మంజూరైన అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.

పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన బిక్కిన సాంబశివరావు ఆరోగ్య సమస్యల కారణంగా వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.

పెనుగొండ మండలం పెనుగొండ గ్రామానికి చెందిన తమనంపూడి వెంకట రామకృష్ణారెడ్డి తన భూమిలో ఒక సెంటు తక్కువగా నమోదైందని రీసర్వే చేసి సవరించాలని కోరారు.

తణుకు పురపాలక సంఘం 7వ వార్డు ప్రజలు తమ ప్రాంతంలో రోడ్డు, త్రాగునీటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వినతిపత్రం సమర్పించారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply