సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

పటమట, ఆంధ్రప్రభ ; రాష్ట్రంలోని పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు.

ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ పిట్టింగేల్‌పేట మోడల్ డెయిరీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో 63 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.87 లక్షల విలువైన చెక్కులను మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పంపిణీ చేశారు.

అదేవిధంగా, 4వ డివిజన్‌కు చెందిన భూపూడి ప్రభుకు చిరువ్యాపారం కోసం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన వ్యక్తిగత నిధుల నుంచి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

గద్దె రామమోహన్ సేవలు అభినందనీయం

మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎవరూ అనారోగ్యంతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయాలు అందిస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రజల మధ్య ఉంటూ అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. గత 20 ఏళ్లుగా టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, బడ్డీకొట్లు అందజేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు.

తమలాంటి నాయకులకు గద్దె రామమోహన్ మార్గదర్శిగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు రూ.8 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం అభినందనీయమన్నారు.

22 వేల మందికి ఇళ్ల పట్టాలు

నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల సమస్యను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారని, సీఎం ఆదేశాలతో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

విజయవాడ నగరంలోని 22 వేల మందికి త్వరలో ఇళ్ల పట్టాలు అందనున్నాయని, దీనికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చొరవే కారణమని చెప్పారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలు

ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ, అత్యవసర వైద్య చికిత్సల కోసం పేదలు అప్పులపాలు కాకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే నియోజకవర్గంలోని పేదలకు రూ.8 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. సహాయం పొందాలనుకునేవారు తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రమేష్, మల్లెల రామకృష్ణ, మమ్మునేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు, పేరేపి ఈశ్వర్, సుగసాని రత్నశ్రీ, నారు రామారావు, తాడి బాబురావు, గుత్తికొండ కృష్ణమోహన్, జాస్తి సురేష్, అబ్దుల్ కరీం, బచ్చలకూరి అజయ్ కుమార్, మేదరమెట్ల నారాయణ, పడాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply