సేవే టీడీపీ లక్ష్యం … రప్పా రప్పా వైసీపీ లక్ష్యం
సేవే టీడీపీ లక్ష్యం … రప్పా రప్పా వైసీపీ లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ
పటమట, ఆంధ్రప్రభ : “సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ అసలు సంస్కృతి” అని, వైసీపీ మాత్రం రప్పా రప్పా అంటూ విష సంస్కృతితో ముందుకు సాగుతుందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ స్పష్టం చేశారు. మంగళవారం 2వ డివిజన్ గుణదల పడవల రేవు సెంటర్ లో డి. శ్రీనివాస్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు గద్దె అనురాధ ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ఎండలు, వడగాల్పులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవడం టీడీపీ బాధ్యతగా భావిస్తోందన్నారు. ప్రజల కష్టసమయంలో ముందుండి సేవ చేయడం టీడీపీ నైజమని, వైసీపీ మాత్రం “రప్పా రప్పా” అంటూ ఆరోపణలు, బెదిరింపు రాజకీయాలతో ముందుకు సాగుతోందని విమర్శించారు.

తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక అయిన ఇళ్ల పట్టాల కోసం ఇప్పటికే సర్వేలు చేపట్టామని, త్వరలోనే అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014–2019 మధ్య రాష్ట్రంలో అభివృద్ధి, సంపద సృష్టికి బాటలు వేసారని, కానీ తరువాత వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం వెనుకబడిందని విమర్శించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మళ్లీ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని, పరిశ్రమలను ఆకర్షించి పెట్టుబడులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. గూగుల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని తెలిపారు.ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న నాయకత్వానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోందని, అదే ప్రభావం రాష్ట్రంలో కూడా కనిపిస్తోందని ఆమె అన్నారు.
చలివేంద్రం ఏర్పాటు చేసిన శ్రీనివాసరావు, పార్టీ శ్రేణులను గద్దె అనురాధ అభినందించారు. ఈ కార్యక్రమంలో పి.ఈశ్వర్, దాసరి గాబ్రియేల్, ముత్యాల కృష్ణ, సుగసాని కృష్ణప్రసాద్, నాళం నరేంద్ర, పర్వతనేని రత్నశ్రీ, యలమంచిలి రాజేష్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు.
