అంగన్వాడీలను వేధిస్తున్న సీడీపీఓపై సస్పెన్షన్ డిమాండ్

అంగన్వాడీలను వేధిస్తున్న సీడీపీఓపై సస్పెన్షన్ డిమాండ్

అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని యూనియన్ ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్

చిత్తూరు, ఆంధ్రప్రభ : జీడీనెల్లూరు ప్రాజెక్టులో అంగన్వాడీ కార్యకర్తలను వేధిస్తున్న సీడీపీఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. అలాగే అక్కడ జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ మంగళవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు గోవిందమ్మ, షకీలా, లలిత, విజయ మాట్లాడుతూ సదరు సీడీపీఓ గతంలో పనిచేసిన ప్రాజెక్టుల్లో కూడా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. జీడీనెల్లూరు ప్రాజెక్టులో బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా యూనియన్‌లను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్యకర్తలను వేధిస్తున్నారని విమర్శించారు.

యూనియన్‌పై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నిస్తే ఎదురుదాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు.

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న యూనియన్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. యూనియన్‌తో పెట్టుకుంటే తగిన ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు, బాధిత కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply