నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…

నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…
భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణకు 100 రోజుల కార్యాచరణ – కలెక్టర్ డా. ఏ. సిరి
కోసిగి, ఆంధ్రప్రభ : నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భూగర్భ జలాల పెంపుదలతో పాటు చెరువుల పునరుద్ధరణ కోసం జిల్లాలో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. జలధార–నీటి భద్రత కార్యక్రమంలో భాగంగా గురువారం కోసిగి మండలం డి. బెలగల్ గ్రామంలోని చెక్ డ్యామ్, నాగమ్మ చెరువును జాయింట్ కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చెక్ డ్యామ్‌లు, చెరువులను నీటితో నింపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాగులు, వంకలలో ఉన్న అడ్డంకులను తొలగించి చెరువులకు నీరు చేరేలా చూడాలని సూచించారు. భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి జిల్లాలోని అన్ని మండలాల్లో అమలు చేయాలని ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కెనాల్స్‌లోని నీటిని ఎల్‌ఎల్‌సీ, చెరువులతో అనుసంధానం చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ఫీడర్ కెనాల్స్ పరిస్థితి, వాటి సామర్థ్యం, జంగిల్ క్లియరెన్స్, బండ్ల మరమ్మతులపై సమగ్ర చర్చ జరిపిన కలెక్టర్, అవసరమైన ఎస్టిమేట్లను సిద్ధం చేసి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కోసిగి మండలంలో చెరువులు, కుంటలు పూడికతో నిండిపోయి లేదా ఎండిపోయి ఉండటం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందన్నారు. జిల్లాలో భూగర్భ జలాల సగటు 6.6 మీటర్లు ఉండగా, కోసిగిలో అది 29 మీటర్ల లోతులో ఉండటం ఆందోళనకరమని తెలిపారు. సమీపంలోని పెద్దకడబూరులో మాత్రం కేవలం 2 మీటర్లలోనే నీటి మట్టం ఉండటం గమనార్హమన్నారు. జిల్లా సగటును 4 మీటర్లలోపుకు తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
డ్వామా, ఇరిగేషన్, వ్యవసాయ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో యాక్షన్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద పనులను శాస్త్రీయంగా అమలు చేసి భూగర్భ జలాల పెంపుదల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో 246 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉండగా, ఇటీవల వర్షాల కారణంగా వాటిలో 75 శాతం కంటే ఎక్కువ నిండాయని చెప్పారు. అయితే వర్షాలపైనే ఆధారపడకుండా వాగులు, వంకలు శుభ్రపరిచి చిన్న కుంటలను కూడా నింపగలిగితే సాగునీటి కోసం ఆధారపడిన బోరు బావులు తిరిగి పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
అందుకే ముందుగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్‌పై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి, డ్వామా పీడీ నరసింహ రెడ్డి, ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, కోసిగి తహసీల్దార్ వేణుగోపాల్ శర్మ, ఎల్‌ఎల్‌సీ చైర్మన్ టిప్పు సుల్తాన్, కూటమి నాయకులు ముత్తురెడ్డి రామిరెడ్డి, నర్సారెడ్డి తదితరులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
