Chennur అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు
Chennur అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు
- కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. బస్తీ దావాఖానా ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూర్ (Chennur), ఆంధ్రప్రభ
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందిస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.
బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై వివాహ ఖర్చుల భారం తగ్గించడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల సంక్షేమం, సామాజిక భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బస్తీ దావాఖానా ప్రారంభించిన మంత్రి
చెన్నూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన బస్తీ దావాఖానాను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బస్తీ దావాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం కత్తరశాల రోడ్డులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

