సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీరందిస్తాం: భట్టి విక్రమార్క

అశ్వాపురం (ఆంధ్రప్రభ): రాష్ట్రంలో గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అశ్వాపురంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బృహత్ నీటిపారుదల ప్రణాళికలో భాగంగానే సీతారామ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని, ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు.

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా మార్చిందని అన్నారు. అలాగే ఇందిరా సాగర్ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టి, రీడిజైన్ పేరుతో ప్రజాధనాన్ని అధికంగా ఖర్చు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఖర్చు చేసిన ప్రజాధనాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను నిలిపివేయకుండా, వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు.

గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుబాటులోకి వచ్చిన ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి రైతాంగానికి అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.