ఈవీఎంల భద్రతపై రాజీ లేదు…

ఈవీఎంల భద్రతపై రాజీ లేదు…
గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవిఎంల) భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు ఈవిఎంల భద్రత అత్యంత కీలకమని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఉన్న ఈవిఎంల భద్రపరిచిన గోడౌన్‌ను కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్‌లో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.
సీసీటీవీ పర్యవేక్షణ, ఎంట్రీ–ఎగ్జిట్ రిజిస్టర్ నిర్వహణ, గోడౌన్‌కు ప్రవేశ నియంత్రణ వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అవసరమైన చోట మెరుగుదల చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈవిఎంలను భద్రపరిచే ప్రక్రియలో ప్రతి దశలో అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ గోడౌన్ నిర్వహణలో పారదర్శకతను కొనసాగించాలని సూచించారు. ఈ తనిఖీలో ఇంచార్జి డీఆర్ఓ చిరంజీవి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి తదితర అధికారులు పాల్గొన్నారు.
