మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య వార్తతో మనోవేదన.. గుండెపోటుతో అభిమాని మృతి
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్త తెలుసుకుని తీవ్ర మనోవేదనకు గురైన నల్లబెల్లి మండలం కొండాయిలపల్లి గ్రామానికి చెందిన ఊరెటి నరేష్ గుండెపోటుతో మృతిచెందిన విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యంపై వచ్చిన సమాచారం తెలుసుకున్న నరేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యారని, కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలారని తెలిపారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయనను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.
ఈ ఘటనతో కొండాయిలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరేష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేపై నరేష్‌కు ఉన్న అభిమానం, అనుబంధమే ఈ విషాదానికి కారణమైందని గ్రామస్తులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు నరేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
