case | దుండగులపై జీఆర్పీ పోలీసుల కాల్పులు

case | దుండగులపై జీఆర్పీ పోలీసుల కాల్పులు
case | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేట్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే ట్రాక్ వెంట అనుమానాస్పదంగా తిరుగుతున్న దుండగులను గుర్తించిన జీఆర్పీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
రైళ్లలో దోపిడీల నియంత్రణ కోసం జీఆర్పీ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా రైల్వే ట్రాక్ వెంట కట్టర్లు పట్టుకుని తిరుగుతున్న కొంతమంది వ్యక్తులు కనిపించారు. వారిని ప్రశ్నించేందుకు పోలీసులు ముందుకెళ్లగా దుండగులు ఒక్కసారిగా రాళ్లు రువ్వినట్లు తెలిసింది.
దుండగుల దాడితో అప్రమత్తమైన పోలీసులు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పొన్నూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
