అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాంల పంపిణీ

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని బడా భీమ్‌గల్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పాఠశాల విద్యలోకి అడుగుపెడుతున్న చిన్నారులకు స్కూల్ యూనిఫాంలను పంపిణీ చేశారు.

గ్రామ సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధన్, ఉపసర్పంచ్ శంకర్ గౌడ్ చిన్నారులకు యూనిఫాంలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారుల్లో విద్యపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. చిన్న వయస్సు నుంచే విద్యాభ్యాసానికి అలవాటు పడితే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ, పాఠశాలకు పంపిస్తూ వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

అంగన్వాడీ టీచర్ భోజమ్మ మాట్లాడుతూ మూడు సంవత్సరాలు పూర్తయిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య అందేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వామి, కాశీరం, వార్డు సభ్యులు రాజ్‌కుమార్, అరుణ్, మాజీ వార్డు సభ్యుడు పిట్ల శ్రీనివాస్, వైద్య సిబ్బంది అంకిత, స్వరూప, లావణ్య, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.