జూలై 1 ధర్నాను విజయవంతం చేయండి..
- 12వ వేజ్‌బోర్డు కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి
- కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై 1న కొత్తగూడెం హెడ్ఆఫీస్ ఎదుట నిర్వహించే ‘డిమాండ్స్ డే’ ధర్నాను కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.భూపాలపల్లిలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పసునూటి రాజేందర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, హెచ్ఎంఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ కె. నరేష్ నేత, సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి దుడ్డేల సాయిలు, హెచ్ఎంఎస్ బ్రాంచ్ కార్యదర్శి జూపల్లి మల్లేష్ మాట్లాడారు.మెడికల్ బోర్డు, సొంతింటి పథకం, పెర్క్విజిట్స్పై ఆదాయపు పన్ను రద్దు తదితర సమస్యలను పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 12వ వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేయకపోవడం కార్మికుల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. వెంటనే 12వ వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేసి అమలు చేయాలని, లేనిపక్షంలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
