హిట్ అండ్ రన్ కేసుల పరిష్కారానికి వేగం

హిట్ అండ్ రన్ కేసుల పరిష్కారానికి వేగం
బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు
జిల్లా స్థాయి అధికారులతో న్యాయ సేవాధికార సంస్థ సమీక్ష
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రహదారి ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు త్వరితగతిన న్యాయం అందించడంతో పాటు హిట్ అండ్ రన్ కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి బి. లీలా వెంకట శేషాద్రి అధికారులను ఆదేశించారు.
కర్నూలులోని న్యాయ సేవా సదన్‌లో మంగళవారం “హిట్ అండ్ రన్ కేసులపై డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ మీటింగ్” నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నమోదైన హిట్ అండ్ రన్ కేసులపై సమగ్రంగా సమీక్షించారు. బాధితులకు అర్హత ప్రకారం నష్టపరిహారం త్వరగా అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

హిట్ అండ్ రన్ కేసుల్లో క్లెయిమ్‌ల పరిష్కారం ఆలస్యం కాకుండా రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలు, బీమా సంస్థలు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు క్లెయిమ్‌లు సకాలంలో సమర్పించి బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సుమోటో రిట్ పిటిషన్ నెం.9/2025, డబ్ల్యూపీ కేసు నెం.1100/2025లో జారీ చేసిన ఆదేశాల అమలుపై అధికారులకు అవగాహన కల్పించారు. రహదారి ప్రమాదాల నివారణ, అత్యవసర సేవల బలోపేతం, జాతీయ రహదారుల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో “జిల్లా రహదారి భద్రత టాస్క్ ఫోర్స్” ఏర్పాటు చేయాలని కోరారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణ కోసం పోలీస్, రవాణా శాఖ సిబ్బందితో ప్రత్యేక రహదారి నిఘా బృందాలను 30 రోజుల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు.
అత్యవసర వైద్య సేవల కోసం ప్రతి టోల్‌ప్లాజా వద్ద అంబులెన్స్‌లు, రికవరీ క్రేన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే జాతీయ రహదారులపై విశ్రాంతి కేంద్రాలు, సురక్షిత పార్కింగ్ స్థలాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారులు, జిల్లా రవాణా అధికారులు, డీటీఆర్‌బీ అధికారులు, రోడ్లు-భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, డీఎంహెచ్‌వో అధికారులు, నేషనల్ హైవే అథారిటీ ప్రతినిధులు, డీసీఆర్‌బీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
