రేగళ్ల పెద్దతండా బిడ్డకు ఐఐఎంలో సీటు
జిల్లాకు గర్వకారణంగా భూక్య తేజస్విని విజయం
లక్ష్మీదేవిపల్లి, ఆంధ్రప్రభ: లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పెద్దతండా గ్రామపంచాయతీకి చెందిన భూక్య తేజస్విని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలో సీటు సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ నేపథ్యం నుంచి జాతీయ స్థాయి విద్యాసంస్థలో ప్రవేశం సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనమని పలువురు అభినందించారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ భూక్య తేజస్వినిని ఘనంగా సన్మానించి అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థిని ఐఐఎంలో సీటు సాధించడం వ్యక్తిగత విజయమే కాకుండా తండా, మండలం, జిల్లాలోని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే విజయమని ఆయన అన్నారు.
ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే క్రమశిక్షణ, కృషి, పట్టుదల అవసరమని పేర్కొన్నారు. తేజస్విని సాధించిన విజయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ప్రతిభకు ప్రాంతం అడ్డుకాదని, అవకాశాలను అందిపుచ్చుకుంటే గ్రామీణ విద్యార్థులు సైతం జాతీయ స్థాయిలో రాణించగలరని తేజస్విని నిరూపించారని అజ్మీర సురేష్ నాయక్ అన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు, విద్యార్థులు, యువకులు, కుటుంబ సభ్యులు పాల్గొని భూక్య తేజస్వినిని అభినందించారు.
