జగ్గారెడ్డిపై చింతా ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చింతా ప్రభాకర్ తీవ్రస్థాయిలో స్పందించారు.
అబద్ధాలు చెప్పడంలో జగ్గారెడ్డి దిట్ట అని, ఆయనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువేనని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్‌రావుపై మాట్లాడే నైతిక హక్కు జగ్గారెడ్డికి లేదన్నారు. హరీష్‌రావు కాలిగోటికి కూడా జగ్గారెడ్డి సరిపోరని వ్యాఖ్యానించారు. గెలిచిన ప్రతిసారీ ప్రజలకు దూరంగా ఉంటూ, తన కోసం, తన కుటుంబం కోసం ప్రజలను మోసం చేయడమే జగ్గారెడ్డి రాజకీయ చరిత్ర అని ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం సరికాదన్నారు.
అవినీతి వ్యవహారాలపై సమాధానం చెప్పాలి
జగ్గారెడ్డి గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో జరిగిన అవినీతి వ్యవహారాలకు ఆరుగురు అధికారులు బలై జైలుకు వెళ్లిన విషయం గుర్తుంచుకోవాలని చింతా ప్రభాకర్ అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పకుండా ఇతరులపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అవకాశం వచ్చిన ప్రతిసారీ పేదల అసైన్డ్ భూములను దోచుకోవడం తప్ప ప్రజా సమస్యలపై జగ్గారెడ్డికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పూర్తిగా పోయిందని, జగ్గారెడ్డిని ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరని అన్నారు.
హరీష్‌రావుపై మాట్లాడితే ఊరుకోం
మాజీ మంత్రి హరీష్‌రావుపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని చింతా ప్రభాకర్ హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని జగ్గారెడ్డికి సూచించారు.
ఈ సమావేశంలో సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు నరహరిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు జైపాల్‌రెడ్డి, డాక్టర్ శ్రీహరి యాదవ్, యూత్ నేత కొండారెడ్డి శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
