వెల్లంపల్లిపై వ్యాఖ్యలు తగవు: వైసీపీ నేతల హెచ్చరిక

భవానిపురం, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షేక్‌ బాజీబాబా హెచ్చరించారు. మంగళవారం రాయల్‌ హోటల్‌ సమీపంలోని ఖాన్‌ దర్బార్‌ సోల్జర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఒక బ్రాండ్‌గా నిలిచారని బాజీబాబా పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులు ఏమిటో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ కార్యాలయం ఉన్న గణపతిరావు రోడ్డును అభివృద్ధి చేసింది కూడా వెల్లంపల్లి శ్రీనివాస్‌ హయాంలోనేనని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనులనే ప్రస్తుతం తమ ప్రభుత్వ అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని బాజీబాబా సవాల్‌ విసిరారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరని విమర్శించారు. గతంలో కేశినేని నానికి ఆ పార్టీ నేతలు వెన్నుపోటు పొడిచారని, ప్రస్తుతం కేశినేని చిన్ని విషయంలోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు.

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్‌ హయాత్‌ మాట్లాడుతూ ఇటీవల జరిగిన మెగా డీఎస్సీపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

పేద విద్యార్థులు, నిరుద్యోగ యువత జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. విద్యార్థుల ఆందోళనలు, మరణాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

53వ డివిజన్‌ అధ్యక్షుడు గురుమంత్ర మహేష్‌ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చేసిన సేవలను గుర్తించకుండా ఆయనపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బొందలి అధ్యక్షుడు నరేంద్రసింగ్‌, ఎన్టీఆర్‌ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి సోల్జర్‌, సహాయ కార్యదర్శి షేక్‌ నజీర్‌, ఎన్టీఆర్‌ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దుర్గాభవాని, ఆర్కే రెడ్డి, షేక్‌ అప్సర్‌, గురుమూర్తి అలీ, మహిళా నాయకులు బంక లక్ష్మి, కనకలక్ష్మి, ఎన్‌. దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు.