BCCI | గిల్, సూర్యలను పక్కన పెట్టేశారు…

BCCI | గిల్, సూర్యలను పక్కన పెట్టేశారు…
- వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్…
- 2026 ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్ట్‌లో చోటు!
ఆంధ్రప్రభ : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ సీజన్‌లో అతను అసాధారణ ప్రదర్శనతో దూసుకుపోయాడు. ఉన్నవి లేనివి రికార్డులన్నీ బద్దలు కొడుతూ… విధ్వంసం సృష్టించాడు. అలా అభిమానుల దృష్టిని ఆకర్శించిన వైభవ్.. బీసీసీఐని కూడా తన వైపు చూసేలా చేశాడు.
జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగబోయే 2026 ఆసియా క్రీడల (Asian Games 2026) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించిన 30 మంది సభ్యుల ప్రాబబుల్స్ (ముందస్తు) జాబితాలో వైభవ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీఐ ఈ జాబితాను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)కు సమర్పించింది. ఈ 30 మంది సభ్యుల జాబితాలో వైభవ్‌తో పాటు యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సంజూ శాంసన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
అయితే, ప్రస్తుతం వన్డే, టెస్ట్ కెప్టెన్ గా ఉన్న గిల్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను బీసీసీఐ పక్కన పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 3 వరకు ఏషియన్ గేమ్స్ జరగనుండగా… అదే సమయంలో (సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 17 వరకు) భారత్‌లో వెస్టిండీస్‌తో వైట్-బాల్ సిరీస్ జరగనుంది. రెండు టోర్నీలు ఒకే సమయంలో వస్తుండటంతో, బీసీసీఐ రెండు వేర్వేరు బలమైన జట్లను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కెప్టెన్సీ రేసులో ఉన్నదెవరు.. !!
వెస్టిండీస్ సిరీస్ కారణంగా ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లను ఏషియన్ గేమ్స్ లాంగ్‌లిస్ట్‌లో చేర్చలేదు. గిల్ హోమ్ సిరీస్‌కు అందుబాటులో ఉండనుండగా, భవిష్యత్ ఒలింపిక్స్ (2028)ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు బీసీసీఐ ప్రాధాన్యత ఇస్తోంది. గిల్, సూర్యకుమార్ లేకపోవడంతో ఆసియా క్రీడల్లో భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, తిలక్ వర్మ రేసులో ముందున్నారు.
ఐపీఎల్ 2026లో పరుగుల విధ్వంసం…
ఇక ఈ సీజన్ ఐపీఎల్ లో బుల్లోడు కాదు.. బుల్డోజర్ అనిపించిన వైభవ్.. ఏకంగా 776 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో 500 పరుగుల మార్కును దాటిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 236 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి టీ20 క్రికెట్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చాడు.
ఈ అద్భుత ప్రదర్శనే అతనికి ఇప్పుడు ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్‌లో చోటు తెచ్చిపెట్టింది. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ తుది జట్టుకు ఎంపికై జపాన్‌లో బరిలోకి దిగితే, భారత సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును బద్దలు కొడతాడు.
