సందడి సందడిగా విజయోత్సవ సభ ప్రాంగణం

సందడి సందడిగా విజయోత్సవ సభ ప్రాంగణం

రెండేళ్ల వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు

సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడుతున్న సభా వాతావరణం

తిరుపతి, జూన్ 12: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దామినేడు వద్ద నిర్వహిస్తున్న విజయోత్సవ సభ ప్రాంగణం సందడి సందడిగా మారింది.

సభ ప్రారంభానికి ముందే పెద్ద సంఖ్యలో ప్రజలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు సభా ప్రాంగణాన్ని పూర్తిగా నింపేశారు.

పార్టీ జెండాలు, నినాదాలు, హర్షధ్వానాలతో సభా వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కళాకారుల ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే పాటలు, నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పటికే రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సభా స్థలానికి చేరుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు కూడా సభా వేదిక వద్దకు చేరుకుంటుండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక కోసం కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.