టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన మంచు మోహన్ బాబు ఇంట్లో జరిగిన వివాదాలు గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ లో మోహన్ బాబు నివాసం వద్ద గొడవల జరగ్గా.. రిపోర్టింగ్ కోసం వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేశారు.
అయితే ఈ దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ ఆస్పత్రి పాలు కావడంతో మోహన్ బాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడి తర్వాత వివిధ పరిణామాలు చోటు చేసుకోగా మోహన్ బాబు తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. అలాగే తన దాడిలో గాయపడిన జర్నలిస్ట్ రంజిత్ ను ఆస్పత్రిలో పరామర్శించి.. క్షమాపణలు చెప్పారు. అలాగే రంజిత్ కు అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చారు. అనంతరం పోలీసులు మంచు కుటుంబ సభ్యులను పిలిచి మరోసారి ఇలా గొడవలకు దిగవద్దని చెప్పారు.
అయినప్పటికీ ఏదో ఒక విషయంలో మంచు ఫ్యామిలీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఇటీవల మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు అక్కడ భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.