ATS Centers Corruption | చలానా ఒకటి.. వసూళ్లు మరొకటి!

ATS Centers Corruption | చలానా ఒకటి.. వసూళ్లు మరొకటి!
ATS Centers Corruption | ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లపై తీవ్ర విమర్శలు
ఏజెంట్ గుర్తే ఫిట్‌నెస్‌కు పాస్‌వర్డ్?
వాహనదారుల్లో పెరుగుతున్న అసంతృప్తి
సమగ్ర విచారణకు ట్రాన్స్‌పోర్ట్ వర్గాల డిమాండ్
ATS Centers Corruption | ఎన్టీఆర్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజల ప్రాణ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు (ఏటీఎస్) ఇప్పుడు అక్రమ వసూళ్లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాల ఫిట్‌నెస్‌ను పారదర్శకంగా, సాంకేతిక ప్రమాణాలతో పరిశీలించాల్సిన ఈ కేంద్రాల్లో ప్రస్తుతం ఏజెంట్ల హవా నడుస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఆర్టీవో కార్యాలయాల వద్ద లైసెన్సులు, ఫిట్‌నెస్ పనులు చేయించే వారిగా పేరొందిన మధ్యవర్తులే ఇప్పుడు ఏటీఎస్ కేంద్రాల చుట్టూ మకాం వేసి వాహనదారులను టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక చలానా చెల్లించినా పని జరగదని, ఏజెంట్ల ద్వారా వెళ్లిన వారికే ఫిట్‌నెస్ సులభంగా లభిస్తోందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
చలానా ఒకటి… వసూళ్లు మరొకటి..!
నిబంధనల ప్రకారం వాహనాల కేటగిరీని బట్టి ఫిట్‌నెస్ ఫీజులు సుమారు రూ.1200 నుంచి రూ.1800 వరకు మాత్రమే ఉండాలి. కానీ ఏటీఎస్ కేంద్రాల వద్ద మాత్రం రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఫిట్‌నెస్ త్వరగా కావాలంటే ఇదే మార్గం” అంటూ ఏజెంట్లు వాహనదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి అధికారికంగా చెల్లించే చలానాకు అదనంగా ఈ మొత్తాలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ముఖ్యంగా కమర్షియల్ వాహనాల యజమానులు, ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు.
ఏజెంట్ గుర్తే ఫిట్‌నెస్‌కు పాస్‌వర్డ్…
ఏజెంట్లు ఫిల్ చేసే దరఖాస్తు పత్రాలపై తమకు సంబంధించిన ప్రత్యేక గుర్తును, సంకేతాన్ని ఒక మూలలో నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ గుర్తు చూసిన వెంటనే సంబంధిత సిబ్బంది ఫార్మాలిటీ పూర్తయింది అన్నట్లుగా వ్యవహరించి వాహనాలకు ఫిట్‌నెస్ క్లియర్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
అదే గుర్తు లేకుండా నేరుగా వచ్చిన వాహనదారులకు మాత్రం అనేక అభ్యంతరాలు చెబుతూ తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చిన్న చిన్న కారణాలు చూపుతూ వాహనాలను వెనక్కి పంపించడం సాధారణంగా మారిందని వాహనదారులు చెబుతున్నారు.
ఏజెంట్ ప్రమేయం లేకుండా ఫిట్‌నెస్‌కు వచ్చిన వాహనాలను బ్రేక్ సరిగా లేదని, లైట్ ఫోకస్ తేడా ఉందని, ఎమిషన్ రిపోర్ట్ క్లియర్ కాలేదని పలు కారణాలతో తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలామంది వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
వాహనదారుల్లో పెరుగుతున్న అసంతృప్తి..
జిల్లాకు ఒక్కటే ఏటీఎస్ కేంద్రం ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనదారులు రోజంతా వేచి ఉండాల్సి వస్తోందని అంటున్నారు. చివరకు చిన్న కారణాలు చెప్పి వెనక్కి పంపడంతో సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“ఏజెంట్ ద్వారా వస్తే గంటల్లో పని.. నేరుగా వస్తే రోజులు తిరగాలి” అన్న భావన వాహనదారుల్లో బలపడుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల ప్రభుత్వంపై కూడా ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటీఎస్ కేంద్రాల్లో జరుగుతున్న వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని వాహనదారులు, ట్రాన్స్‌పోర్ట్ వర్గాలు కోరుతున్నాయి.
