రికార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్మూర్ సబ్ కలెక్టర్

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా భూ-భారతి రికార్డులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రెవెన్యూ, భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, వివిధ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.భూముల రికార్డుల నిర్వహణ, ధరణి/భూ సంబంధిత దరఖాస్తులు, మ్యూటేషన్, వారసత్వం, భూ సమస్యలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించినట్లు తెలిసింది.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలుసుకొని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. అలాగే కార్యాలయంలో రికార్డులను క్రమపద్ధతిలో భద్రపరచాలని, రెవెన్యూ వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు.ఈ తనిఖీలో తహసిల్దార్ ఎం.కిరణ్ కుమార్,డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్,ఎలక్షన్ డీటీ అశ్విన్ బాబు,ఆర్‌ఐలు మల్లేష్, స్వాతి, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.