తిమ్మారెడ్డిపల్లి తండాలో తాగునీటి తండ్లాట..

  • కిలోమీటర్‌ దూరం నుంచి నీటిని తెచ్చుకుంటున్న మహిళలు..
  • వ్యవసాయ బోర్లే దిక్కు

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. తండాలో తాగునీటి వసతి సరిగా లేకపోవడంతో ప్రజలు నిత్యావసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు కడవలతో నీటి కోసం కిలోమీటర్‌ దూరం వెళ్లి నీటిని తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. తండాలో నీటి ఎద్దడి తీవ్రతరం కావడంతో ప్రజలు వ్యవసాయ బోరుబావులపై ఆధారపడుతున్నారు. ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా బోర్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాగునీటి కోసం ప్రతిరోజూ సమయం, డబ్బు వెచ్చించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. వేసవిలోనే కాకుండా ప్రస్తుతం కూడా తాగునీటి సమస్య కొనసాగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా నీరు అందకపోవడంతో మహిళలు ఉదయం నుంచే నీటి కోసం పరుగులు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. బోరుబావుల వద్ద కూడా నీటి లభ్యత తగ్గితే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తండాలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని వారు ఆరోపిస్తున్నారు. తండాకు తాగునీటి సరఫరా మెరుగుపరచడంతో పాటు, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తండావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.