ఏపీఐఐసీ కాలనీవాసుల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కార దిశగా అడుగులు..

ఏపీఐఐసీ కాలనీవాసుల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కార దిశగా అడుగులు..

500 కుటుంబాలకు ఊరట

విజయవాడ, ఆంధ్రప్రభ : ఏపీఐఐసీ కాలనీవాసుల దశాబ్దాల నాటి రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ సమస్యపై విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ప్రత్యేక చొరవ చూపారు.

విజయవాడలోని సీఎస్ క్యాంప్ కార్యాలయంలో సీఎస్ సాయి ప్రసాద్ అధ్యక్షతన ఏపీఐఐసీ కాలనీవాసుల రిజిస్ట్రేషన్ సమస్యపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి అనగాని సత్య ప్రసాద్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఏపీఐఐసీ కాలనీ ఆటోనగర్ కార్మికుల కోసం గతంలో నిర్మించిన క్వార్టర్స్‌లో కేవలం ప్లింత్ ఏరియాకే రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. ముందు, వెనుక ఉన్న స్థలాన్ని ఖాళీగా ఉంచడంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారమైతే ఈడబ్ల్యూఎస్, ఎంఐజి కుటుంబాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. గత టీడీపీ హయాంలో ఈ అంశంపై స్పష్టత వచ్చినప్పటికీ, అనంతర ప్రభుత్వ కాలంలో సమస్య పెండింగ్‌లోకి వెళ్లిందని ఆయన అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీ తెలిపారు. సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్ సానుకూలంగా స్పందించి రీ-సర్వే నిర్వహించాలని, ఆ సర్వే ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా త్వరలో ఈ ప్రతిపాదనను క్యాబినెట్‌లో పెట్టాలని సూచించినట్లు ఎంపీ వివరించారు.

దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సమస్య పరిష్కార దిశగా అడుగులు పడటంపై సుమారు 500 కార్మిక కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా సీఎస్ సాయి ప్రసాద్, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి అనగాని సత్య ప్రసాద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply