AP | పాఠశాలల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో

AP | పాఠశాలల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో

  • సామాజిక భాగస్వామ్యం అవసరం
  • జిల్లా విద్యాశాఖ అధికారులు

AP | చిత్తూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో: పాఠశాలల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో సామాజిక భాగస్వామ్యం అత్యంత కీలకమని సమగ్ర శిక్షా చిత్తూరు ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ, జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాక సమాజం మొత్తం కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాంజలి కార్యక్రమం అమలుపై జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణా కార్యక్రమం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించబడింది.

జిల్లాలోని 31 మండలాల నుంచి మండల విద్యాశాఖ అధికారులు, ప్రతి మండలం నుంచి ఒక రిసోర్స్ పర్సన్, ఒక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్‌పర్సన్, ఒక క్లస్టర్ హెడ్‌మాస్టర్ పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించి, జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలలు సమాజంతో అనుసంధానం కావాల్సిన అవసరాన్ని వివరించారు.

AP

“విద్యాంజలి” అనే పదానికి విద్య అంటే జ్ఞానం, అంజలి అంటే సహృదయంతో సమర్పించడం అనే అర్థం ఉన్నదని, అదే ఈ కార్యక్రమం యొక్క మూలసారమని శిక్షణలో తెలిపారు. పాఠశాలల అవసరాలను ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు గుర్తించి ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తారు. స్వచ్ఛంద సేవలు అందించాలనుకునే వాలంటీర్లు లేదా సంస్థలు తమ సేవలను బోధన రూపంలో గానీ, వస్తు రూపంలో గానీ నమోదు చేసుకోవచ్చు.

పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు రిసోర్స్ పర్సన్లుగా సేవలందించవచ్చని వివరించారు. తమ నైపుణ్యానికి అనుగుణంగా పాఠ్యాంశ బోధన, చిత్రలేఖనం, పెయింటింగ్, ఇతర కళలు, జీవన నైపుణ్యాలు బోధించడమే కాక పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వామ్యం కావచ్చని చెప్పారు.

పోర్టల్‌లో నమోదైన అవసరాలను తగిన వాలంటీర్లతో అనుసంధానం చేసి ఆయా పాఠశాలలకు సేవలు అందేలా మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ సేవలు పూర్తిగా స్వచ్ఛందమైనవని, ఎటువంటి పారితోషికం లేదా జీతభత్యాలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారిక మార్గాల ద్వారానే సేవలు అందించాలని సూచించారు.

జిల్లాస్థాయి శిక్షణ అనంతరం మండల స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 4న ప్రతి మండలంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించి మండలంలోని ఇద్దరు ఎంఈఓలు, క్లస్టర్ హెచ్‌ఎంలు, ఎన్‌జీఓలు, ఎస్ఎంసి ఛైర్‌పర్సన్లు, సీఆర్‌పీలు పాల్గొననున్నారు. ఈ విధంగా విద్యాంజలి 2.0 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు సమాజ సహకారంతో మరింత బలపడతాయని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply