బోయపల్లిలో దళితవాడకు అందని మిషన్ భగీరథ నీరు..

  • చుక్క తాగునీరు లేక బోరు నీరే దిక్కవుతున్న ప్రజలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారి-363 సమీపంలో ఉన్న తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామ దళితవాడలో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లక్షల రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌, ఇంటింటికీ పైప్‌లైన్లు, నల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ చుక్క తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో దళితవాడ ప్రజలు ఇప్పటికీ బోరు నీరుపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది.

అధికారుల పర్యవేక్షణ లోపం, కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మిషన్ భగీరథ నీరు దళితవాడకు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వాడలో 50కి పైగా నివాస గృహాలు ఉండగా, సుమారు 250 మంది దళితులు నివసిస్తున్నారు. అయినప్పటికీ, మిషన్ భగీరథ 20 కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ ఉపయోగం లేకుండా వృథాగా నిలిచిపోయింది.

దళితవీధుల్లో మురికి కాలువల మధ్యగానే తాగునీటి పైప్‌లైన్లు అస్తవ్యస్తంగా వేయడంతో పాటు, వాటర్ ట్యాంక్‌ను చాలా కాలంగా శుభ్రపరచకపోవడం మరో సమస్యగా మారింది. ఒకవైపు పైప్‌లైన్ల నుంచి నీరు నల్లాల్లోకి రావడం లేదని, మరోవైపు ఇళ్లలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్లాలు నిరుపయోగంగా మూలన పడి ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ బోర్ల నుంచి వచ్చే నీటినే తాగుతుండటంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, మోకాళ్ల నొప్పులు, కీళ్ల వ్యాధులు తదితర రోగాల బారిన పడుతున్నామని దళితవాడ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ దుర్భర పరిస్థితులపై గతంలో మిషన్ భగీరథ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ తమ వాడను పట్టించుకోలేదని దళితులు వాపోతున్నారు. దళితవాడతో పాటు గ్రామంలోని ఇతర వాడల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి బోయపల్లి దళితవాడకు మిషన్ భగీరథ తాగునీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, మురికి కాలువల్లో వేసిన పైప్‌లైన్లను తొలగించి శాస్త్రీయంగా కొత్త పైప్‌లైన్లు ఏర్పాటు చేసి, శుద్ధమైన తాగునీరు అందేలా చూడాలని దళితవాడ ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply