పల్లె సింధూర రెడ్డికి ఛాంపియన్‌షిప్..

పల్లె సింధూర రెడ్డికి ఛాంపియన్‌షిప్..

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో సత్తా చాటిన పుట్టపర్తి ఎమ్మెల్యే
8 మెడల్స్, విన్నర్స్ కప్పుతో ప్రతిభకు గుర్తింపు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా సాంస్కృతిక పోటీల్లో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. పలు క్రీడా విభాగాల్లో పాల్గొని మొత్తం 8 మెడల్స్‌తో పాటు విన్నర్స్ కప్పును అందుకొని తన క్రీడా నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో విజయవాడలోని మున్సిపల్ ఇందిరా గాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించారు. శాసనసభ్యుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ క్రీడా ఉత్సవాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ పోటీల్లో భాగంగా టగ్ ఆఫ్ వార్, జావెలిన్ త్రో, షాట్ పుట్, టెన్నిస్, మ్యూజికల్ చైర్, టికిల్ బాల్, టెన్నికాయిట్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి పలు క్రీడల్లో పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. టగ్ ఆఫ్ వార్ పోటీలో విజేతగా నిలవగా, టెన్నికాయిట్‌లో కూడా అద్భుత ప్రదర్శన కనబరిచి విన్నర్‌గా నిలిచారు. అలాగే షటిల్ బ్యాడ్మింటన్, మ్యూజికల్ చైర్, టికిల్ బాల్ వంటి విభాగాల్లో రన్నర్‌గా నిలిచి మొత్తం ఎనిమిది మెడల్స్ సాధించారు. ఆమె చూపిన క్రీడా స్పూర్తి, పోటీ ధోరణి అందరినీ ఆకట్టుకుంది.
క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని అంతర్లక్స్ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆట విడుపు–2026” కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ప్రతిభను సాంస్కృతిక రంగంలోనూ ప్రదర్శించారు.

కొందరు సినీ పాటలు పాడగా, మరికొందరు మిమిక్రీ, నాటికలు ప్రదర్శించి సభలో నవ్వులు పూయించారు. ఈ కార్యక్రమం అందరినీ ఉత్సాహపరిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పల్లె సింధూర రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా రెండు విన్నర్స్ కప్పులు, ఎనిమిది మెడల్స్ అందజేశారు.

క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, అనిత, సంధ్యారాణి తదితరులు ఆమెను ప్రశంసించారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పల్లె సింధూర రెడ్డిని “క్రీడల రాణి”గా అభివర్ణిస్తూ ప్రత్యేకంగా అభినందించారు. శాసన బాధ్యతలతో పాటు క్రీడల్లోనూ తన ప్రతిభను చాటుకోవడం ద్వారా పల్లె సింధూర రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారని పలువురు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య నిర్వహించిన ఈ క్రీడా పోటీలు స్నేహభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply