solar power storage | ఏపీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విప్లవం

solar power storage | ఏపీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విప్లవం

solar power storage | అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. గడచిన రెండేళ్ల వ్యవధిలో అనేక సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రముఖ సంస్థలు ప్రభుత్వం ఎంవోయూ సైతం కుదుర్చుకున్నాయి. ఇప్పటికే పలు సంస్థలకు అనుమతుల మంజూరు, భూ కేటాయింపుల వంటి ప్రక్రియలను చేపట్టింది. మరికొన్ని ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో పునరుత్పాదక విద్యుత్తుతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పగటి వేళల్లో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తును నిల్వ చేసుకొని అవసరమైన సమయంలో వినియోగించుకొనే ఉద్దేశంతో ఈ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

ఐదేళ్లు ఇంధన శాఖ అనేక ఒడిదుడికలకు గురికావడంతో కూటమి ప్రభుత్వం ఈ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చింది. దీంతో వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేదిశగా చర్యలు చేపట్టింది. ఫీడర్ లెవల్ సోలరైజేషన్‌తో వ్యవసాయ సర్వీసులకు సౌర విద్యుత్తు అందించాలని నిర్ణయించారు.

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బెస్) సాంకేతికతతో సౌర ప్రాజెక్టుల నుంచి లభించే విద్యుత్తును నిల్వ చేసుకునే పనులకు కుప్పం కేంద్రంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం శాంతిపురంలో స్థలం సైతం కేటాయించారు.

కుప్పం నియోజకవర్గంలోని ఇళ్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, వ్యవసాయ సర్వీసులకు కలిపి 250 మెగావాట్ల విద్యుత్తు వినియోగిస్తున్నారు. సౌర విద్యుత్తు ద్వారా 50 మెగావాట్లు ఉత్పత్తి చేసి నిల్వ చేయాలని నిర్ణయించారు. ఈ విద్యుత్తును 12 ఏళ్లపాటు నిల్వ చేసుకోవచ్చు. ఇందుకు యూనిట్‌కు రూ. 2.15 ఖర్చు అవుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో వినియోగిస్తారు. ప్రస్తుతం 50 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌కు సంబంధించి పనులు మొదలయ్యాయి.

శాంతిపురం మండలం మాదనపల్లి విద్యుత్తు ఉపకేంద్రం పక్కన ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ సంస్థకు స్థలం కేటాయించారు. వచ్చే జనవరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిశ్రమలు పెరిగి మరింత విద్యుత్తు అవసరమైతే మరో 50 మెగావాట్లు ఇదేవిధంగా నిల్వ చేసి లోటు లేకుండా చేయాలని భావిస్తున్నారు. ఇది మంచి ఫలితాలు ఇచ్చి, కొనుగోళ్ల వ్యయం తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహం

ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా బీఈఎస్ఎస్ ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తుంది. విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వ చేసి అవసరమైనప్పుడు విడుదల చేసే సాంకేతిక వ్యవస్థ ఈ యూనిట్లలో ఏర్పాటుచేయనున్నారు. సాధారణంగా సోలార్, విండ్ ద్వారా ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్తును నిల్వ చేసి రాత్రి పూట, పీక్ అవర్స్‌లో వినియోగించుకొనేందుకు బీఈఎస్ఎస్లు ఉపకరిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏపీలో భారీగా సౌర, గాలి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ ఏర్పాటుకు ఇంధన సంస్థలు శ్రీకారం చుడుతున్నాయి.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో వీటి ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. డిస్కంలపై ఒత్తిడి తగ్గడంతో పాటు వేగంగా విద్యుత్ విడుదల చేసే అవకాశం ఉంది. పర్యావరణానికి అనుకూలమైన ఈ వ్యవస్థ ద్వారా విద్యుత్ కోతల సమస్యలకు చక్కటి పరిష్కారం లభించనుంది.

వ్యవసాయానికి కూడా ఈ విద్యుత్తును వినియోగించుకొనే సౌలభ్యం ఉంటుంది. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే ఆస్కారం ఏర్పడుతుంది. పరిశ్రమలకు కూడా ఎటువంటి అంతరాయాలు లేని విద్యుత్తును 24 గంటలు అందించవచ్చు. గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద రాష్ట్రంలో చేపడుతున్న అనేక సంస్కరణలు చక్కటి ఫలితాలను ఇస్తున్నాయి. పునరుత్పాదక ఇంధన వినియోగంలో రాష్ట్రం ముందంజలో ఉంది. విద్యుత్ నిల్వ వ్యవస్థ మాత్రమే కాకుండా, భవిష్యత్ విద్యుత్ భద్రతకు ఎంతగానో ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలికిరి వద్ద 150 ఎండబ్ల్యూ / 300 ఎండబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ప్రాజెక్టు రూపకల్పన జరుగుతోంది. దీనికి అనుసంధానంగా 400/220 కేవీ సబ్‌స్టేషన్లను ఏర్పాటుచేయనున్నారు.

మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 1000 ఎండబ్ల్యూ / 2000 ఎండబ్ల్యూహెచ్ సామర్థ్యంతో బీఈఎస్ఎస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో యూనిట్ ఖర్చు రూ. 10 నుంచి రూ. 4.85కు తగ్గించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఏడాదికి రూ. 4 నుంచి 5 వేల కోట్లు ఆదా కూడా అయ్యే అవకాశం ఉంది.

నంద్యాలలో 1200 ఎండబ్ల్యూహెచ్ సామర్థ్యంతో మరో ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కడప, కర్నూలులో కూడా ప్రారంభించనున్నారు. రాష్ట్రాన్ని స్టోరేజీ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 5000 ఎండబ్ల్యూహెచ్ సామర్థ్యంతో పూర్తిస్థాయి నిల్వ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply